ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే జొన్నలను ఆహారంగా ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతం జొన్నల ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ జొన్నలను ప్రతిరోజు వారి ఆహారంలో ఉపయోగించడానికి మక్కువ చూపిస్తున్నారు. జొన్న రొట్టె, జొన్న పాయసం, జొన్న సంగటి అత్యంత ప్రాచీరం పొందిన వంటకాలు. జొన్న రొట్టెలను ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు జొన్న రొట్టెలను ఆహారంగా తీసుకుంటే జొన్నల్లో అత్యధికంగా ఉన్న పీచు పదార్థం రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. మన శరీరంలో చెడు కొవ్వులను కరిగించడానికి ఫైబర్ సహాయపడుతుంది జొన్నలను ఆహారంగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి ఉబకాయం, అధిక రక్తపోటు, గుండె జబ్బులను నియంత్రించడంలో సహాయపడుతుంది.
జొన్న చిరుధాన్యంలో కాల్షియం, ఐరన్ ,పాస్ఫరస్, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ డి, b3 వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.ఎముకలను దృఢంగా ఉంచి కీళ్ల నొప్పుల సమస్యను తగ్గిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి ప్రమాదకర అనీమియా వ్యాధిని అదుపు చేస్తుంది. మెగ్నీషియం కణాల అభివృద్ధికి సహాయపడి మెదడును చురుగ్గా ఉంచుతుంది.
జొన్నల్లో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. జొన్నల్లో గ్లూటెన్ ఉండదు, ఫైబర్ అత్యధికంగా లభిస్తుంది. కావున వీటిని ఆహారంగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి మలబద్ధకం, గ్యాస్ట్రిక్, అజీర్తి, పెద్ద పేగు క్యాన్సర్ వంటివి తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కావున జొన్న రొట్టెలను రోజులో ఏదో ఒక పూట ఆహారంగా తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.