కారం ఎక్కువగా తింటే జీవితకాలం పెరుగుతుందా.. సర్వేలు ఏం చెబుతున్నాయో తెలుసా?

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కారం, ఉప్పు, పులుపు వంటి రుచులు సమానంగా వేసుకుంటే ఆహారం ఎంతో రుచిగా ఉండి తినడానికి అద్భుతంగా ఉంటుంది.వీటిలో ఏ ఒక్క రుచి తగ్గిన ఆహారం మనకు రుచించదు. ముఖ్యంగా ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కారం ఎక్కువగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తరచూ చెప్పడం వినే ఉంటాం. అయితే ఇటీవల కొన్ని పరిశోధన ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రతిరోజు ఆహారంలో కారం ఎక్కువగా తినే వారు ఎక్కువ రోజులు జీవిస్తున్నారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే అంటున్నారు పరిశోధన నిర్వహించిన వైద్యులు.

ఇటీవలే చైనాలోని కొన్ని ప్రాంతాల ప్రజల పైన నిర్వహించిన సర్వేల్లో ఈ ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వారానికి రెండుసార్లు మాత్రమే కారం తినే వారితో పోలిస్తే ప్రతిరోజు కారం తినేవారే ఎక్కువ రోజులు జీవిస్తున్నారట. దీని ప్రకారం కారం తినని వారితో పోలిస్తే కారం అధికంగా తీసుకుని వారిలో 10% మరణాల రేటు తక్కువగా ఉందని సర్వే వెల్లడిస్తోంది. ప్రతిరోజు పచ్చిమిర్చి, మిరియాలు రోజువారి ఆహారంలో ఎక్కువగా ఉపయోగిస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.అయితే ప్రపంచ శాస్త్రవేత్తలు మాత్రం చైనా ప్రజల జీవన విధానం అక్కడి సాంప్రదాయ వంటల వల్ల అలా జరిగి ఉండవచ్చు అన్ని చోట్ల దాని ఫలితాలు ఒకేలా ఉంటాయి అనుకోవడం మంచిది కాదు. అక్కడి ప్రజలకు ఈ సర్వే మంచి చేయొచ్చు ఇతర దేశాల ప్రజలకు ఈ సర్వేని అన్వయించుకోవడం మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏది ఏమైనా ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో కారం తగిన పరిమాణంలో తీసుకోవడమే మంచిది. అధిక కారం ఉన్న పచ్చిమిర్చి,ఎండుమిర్చి మిరియాలు ఎక్కువగా తింటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. దాని ఫలితంగా కడుపులో మంట, గ్యాస్ట్రిక్, గుండె దడ వంటి అనేక సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కారం ఉప్పును బాగా తగ్గించాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏ ఆహార పదార్ధాన్ని అయినా అధిక మోతాదులో తీసుకుంటే అది మన ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే కారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కారం, ఉప్పును తగిన పరిమాణంలో తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్య తలెత్తే అవకాశాలు ఉండవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు