గంధపు నూనెలో ఉన్న ఔషధ గుణాలు..ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

ప్రపంచంలో ఎక్కడ లేని అత్యంత నాణ్యమైన గంధపు చెట్లు దక్షిణ భారతదేశంలో మాత్రమే సమృద్ధిగా లభిస్తాయి.సువాసన భరితమైన గంధపు చెక్కలోని ఔషధ గుణాలను గుర్తించిన మన పూర్వీకులు భారతీయ ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాల మొండి వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా గంధపు చెట్ల నుంచి లభ్యమయ్యే అత్యంత సుగంధ భరితమైన నూనెలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండడంతో అంతర్జాతీయంగా ఈ నూనెకు చాలా ప్రాముఖ్యత ఉంది. గంధపు నూనెలు ఉన్న ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

గంధపు నూనెలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియన్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ ఈ,సెస్క్విటెర్పెనెస్ అని పిలిచే సహజమైన రసాయన సమ్మేళనాలను సమృద్ధిగా కలిగి ఉండడంతో మనం ప్రతిరోజు ఉపయోగించే సబ్బులు, పేస్ క్రీం, హెయిర్ ఆయిల్ వంటి బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గంధపు నూనెలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరం లోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది.

తరచూ చర్మ అలర్జీలు, ఇన్ఫెక్షన్ల సమస్యతో బాధపడేవారు గంధపు నూనెను ఉపయోగిస్తే ఇందులో యాంటీ మైక్రోబియన్ గుణాలు చర్మం లోని మృత కణాల సంఖ్యను తగ్గించి చర్మానికి సహజ సౌందర్యాన్ని ఇవ్వడంలో సహాయపడుతుంది. అలాగే చర్మంపై వచ్చే మచ్చలు, ముడతలు, కంటి కింద నల్లని వలయాలు, వృద్ధాప్య ఛాయాలను అరికట్టడంలో సహాయపడుతుంది.యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న గంధపు నూనె ప్రమాదకర బ్యాక్టీరియాను నశింపజేసి చిగుళ్ల సమస్యను, రక్తస్రావాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.
నూనెలోని వెచ్చని, రిఫ్రెష్ సువాసన మీ మనస్సును శాంతింపజేయడంలో సహాయపడి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.