తేనెను ఇలా తింటే మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావం చూపుతుందనీ మీకు తెలుసా?

సహజ ఔషధ గుణాలతో పాటు పోషక విలువలు సమృద్ధిగా కలిగిన తేనెను రోజువారి ఆహారంలో తీసుకుంటే మన శరీర జీవక్రియలకు అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభించడంతోపాటు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో తేనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే చాలామంది తేనెను ఆహారంగా తీసుకునే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ అనారోగ్య సమస్యలకు కారణమవుతుంటారు. తేనెను వాడే విషయంలో చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తేనెను ఆహారంగా తీసుకునే విషయంలో చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే వేడి వేడి పాలు, గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి పానీయాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు.ఈ చర్య వల్ల తేనెలో ఉండే ఔషధ గుణాలు నశించిపోవడమే కాకుండా కొందరిలో తీవ్ర అనారోగ్య లక్షణాలకు కూడా కారణమవుతుంది.
కారణం తేనే ఉష్ణవీర్యపదార్థం కావున తేనెను అధిక వేడి పదార్థాలతో కానీ, నేరుగా మంటపై మరిగించడం వంటి పనులు అసలు చేయకూడదు. మరియు తేనెను పిప్పళ్ళు, మిరియాలు వంటి వాటితో కలిపి అస్సలు తినకూడదు. ముఖ్యంగా చక్కెర వ్యాధిగ్రస్తులు తేనెను తినే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి తినాలనిపిస్తే వైద్య సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.

తేనెను అధిక వేడి వాతావరణ పరిస్థితులు ఉన్న సమయంలో తక్కువ పరిమాణంలో తీసుకోవాలి ముఖ్యంగా ఎండాకాలంలో. మద్యం సేవించినప్పుడు మరియు మసాలా పదార్థాలు అధికంగా తిన్నప్పుడు తేనెను తినడం మంచిది కాదు. ముఖ్యంగా ఆవనూనె మరియు వర్షపు నీటితో కలిపి తేనెను అస్సలు తినకూడదు ఇలా చేస్తే మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావం పడవచ్చు. చాలామంది తేనెను ఫ్రిజ్లో ఉంచి వినియోగిస్తుంటారు. ఇలా చేస్తే తేనెలో పంచదార స్పటికాలుగా తయారవుతుంది. ఆయుర్వేద నిపుణులు చెబుతున్న దాని ప్రకారం నెయ్యి తేనెను సమ పరిమాణంలో కలిపి తీసుకోవడం ప్రకృతి విరుద్ధం.