పిల్లలను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచే అద్భుతమైన మార్గాలు ఏంటో తెలుసా?

తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పిల్లలకి ఇచ్చే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే భవిష్యత్తులో వారి మానసిక, శారీరక ఎదుగుదలలో వ్యత్యాసం ఏర్పడి శారీరకంగానూ మానసికంగాను కృంగుబాటు కలుగుతుంది. దాంతో చదువులోనూ, ఆటల్లోనూ చురుకుదనం తగ్గి వెనకబడి పోతారు. ప్రతిరోజు ఆహారంలో బ్రెడ్, చాక్లెట్ , పిజ్జా, బర్గర్ వంటి జంక్ ఫుడ్ కు బదులు సహజంగా దొరికే పండ్లు, కూరగాయలు ,డ్రై ఫ్రూట్స్ వంటివి వారికి ఇష్టమైన రీతిలో ఇచ్చి తినిపించడం మన బాధ్యత.
కావున పిల్లల్లో పోషకాహార లోపాన్ని తొలగించడానికి ఏ ఆహారాన్ని ఏ విధంగా ఇవ్వాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం.

ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డును తినడం ఆరోగ్యానికి మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే చిన్న పిల్లలు గుడ్డు తినడానికి మారం చేస్తారు. అలాంటప్పుడు పిల్లలకు మాటలు చెబుతూనే ఆటలు ఆడిస్తూనే మెల్లమెల్లగా గుడ్డును తినే విధంగా చేయాలి.అలాంటప్పుడే సంపూర్ణ పోషణ అందుతుంది.

పిల్లలు మొదట ఏ ఆహారాన్ని ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలుసుకొని అలాంటి ఆహారాన్ని తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు పిల్లలకు అందించాలి. ఎందుకంటే పిల్లలు జీర్ణక్రియ రేటు తక్కువగా ఉంటుంది తక్కువ ఆహారాన్ని అందించినప్పుడు ఆహారం త్వరగా జీర్ణం అయ్యి పోషకాలన్ని సమృద్ధిగా పిల్లలకు అందుతాయి.

పిల్లల పెరుగుదలకు అవసరమైన క్యాల్షియం,ఐరన్, జింకు, ఫాస్ఫరస్ వంటి మూలకాలు సమృద్ధిగా ఉండే బాదంపప్పు, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ను అదనపు ఆహారంగా ఇవ్వాలి.

పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచి విటమిన్ సి కలిగిన క్యారెట్, ఆపిల్, అరటి బొప్పాయి పైనాపిల్, కివి వంటి పండ్లను ఆహారంలో భాగం చేయాలి. పండ్లను తినడానికి ఇష్టపడకపోతే వాటిని రుచికరమైన జ్యూస్ రూపంలో అందిస్తే సరిపోతుంది.

బిస్కెట్, చాక్లెట్ వంటి జంక్ ఫుడ్ కు బదులు ప్రతిరోజు మొలక కట్టిన గింజలను తినిపించడం వల్ల పిల్లల్లో విటమిన్స్ ,మినరల్స్ ,ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి.

పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది పిల్లల ఎముకల పెరుగుదలకు ,దృఢత్వానికి తోడ్పడుతుంది. కావున పిల్లలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా గోరువెచ్చని పాలను తాగించాలి. అలాగే వెన్న ,నెయ్యి వంటివి ఆహారంలో అలవాటు చేయడం మంచిది.

పిల్లలకు పౌష్టికాహారంతో పాటు వారికి ఇష్టమైన డ్యాన్స్, సంగీతం, ఆటలు , డ్రాయింగ్ వంటివి నేర్పిస్తే వారిలో శారీరక, మానసిక అలసట తొలగి రోజంతా ఉల్లాసంగా ఉంటారు. చదువులపై ఆసక్తి చూపుతారు.