రాత్రి సమయాల్లో నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా అయితే ఇలా చేయండి!

మన సంపూర్ణ ఆరోగ్యానికి కడుపునిండా తిండి ఎంత అవసరమో ప్రశాంతమైన నిద్ర కూడా అంతే అవసరం ఈ విషయం గ్రహించక చాలామంది అర్థరాత్రి వరకు మేల్కొని కంప్యూటర్, మొబైల్, టీవీ సీరియల్స్ తో కాలక్షేపం చేస్తుంటారు. దాని ఫలితంగా నిద్రలేమి సమస్య తలెత్తి మానసిక ఒత్తిడి, డిప్రెషన్, గుండె జబ్బు, అల్జీమర్, కళ్లజబ్బులు, కంటి కింద నల్లని వలయాలు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన సంపూర్ణ ఆరోగ్యానికి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. మరికొందరు రాత్రులు మేల్కొని పగటి సమయంలో నిద్రపోతుంటారు పగటి నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదు జీవక్రియలు మందగించి ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉంటుంది.

రాత్రి సమయాల్లో సుఖప్రదమైన నిద్ర కోసం కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది అవేంటో ఇప్పుడు చూద్దాం. పడుకోవడానికి ముందు గోరువెచ్చని పాలు ఖర్జూర పండ్లను కలిపి తింటే మెదడు ప్రశాంతత కలిగి సుఖప్రదమైన నిద్ర కలుగుతుంది.రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు మొబైల్ ఫోన్, టెలివిజన్ వంటి ఉపయోగించడం మానుకోండి. ప్రతిరోజు సరైన సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి అప్పుడే నిద్ర తొందరగా పడుతుంది. రాత్రి పడుకునే ముందు అతిగా తింటే సరిగ్గా నిద్రపట్టదు. అందుకే పడుకోవడానికి రెండు గంటల ముందు లిమిట్ లో తినండి.రాత్రిపూట వేయించిన, నూనె, కారంగా ఉండే ఆహారాలను తినకపోవడమే మంచిది.

నిద్రను ప్రోత్సహించే మేలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిలో సహాయపడే గుమ్మడి గింజలు, బాదం, వాల్నట్, పిస్తా అవిసె గింజలు,చియా విత్తనాలను ఆహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉండొచ్చు. పడుకునే గదిలో అధికంగా ప్రకాశించే లైట్స్ అసలు వాడకండి ఈ కాంతి మీ నిద్రకు భంగం కలిగించవచ్చు. పడక గదిలో బెడ్ లైట్స్ ను ఉపయోగించడం మంచిది.
అధిక మానసిక ఒత్తిడి కూడా మనకు నిద్రపట్టకుండా చేస్తుంది.అందుకే ఒత్తిడి తగ్గేందుకు యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి మీ నిత్య జీవక్రియలో భాగం చేసుకోవడం మంచిది.