గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు…. గుర్తించగలిగితే ప్రమాదం నుంచి బయటపడవచ్చు తెలుసా?

doc6wgbo29zhpfrv1iak1e

ఈ రోజుల్లో యుక్త వయసులోనే గుండె సంబంధిత జబ్బులతో డాక్టర్ల దగ్గరకు పరుగులు పెట్టే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తీవ్రమైన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, రోజువారి ఆహారంలో అత్యధిక కేలరీలు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు కలిగిన ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ వంటివి ఎక్కువగా తినడం వల్ల ఉబకాయ సమస్య తలెత్తి అనేక గుండె జబ్బులకు కారణం అవుతుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవడంతోపాటు, మద్యపానం దుమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అలాగే ప్రతిరోజు వ్యాయామం ,నడక, యోగా వంటివి అలవాటు చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.

 

హఠాత్తుగా గుండెపోటు సమస్య తలెత్తినప్పుడు సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. సహజంగా గుండెపోటు రావడానికి ముందు మన శరీరంలో కొన్ని లక్షణాలు, మార్పులు జరిగి ముందస్తు సిగ్నల్ ఇస్తూ ఉంటాయి. ముందస్తు గుండెపోటు లక్షణాలను గుర్తించగలిగి తక్షణ వైద్య సదుపాయం తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. అసలు గుండెపోటు రావడానికి ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 

గుండెపోటు రావడానికి ముందు అలసటగా ఉండి శరీరం మొత్తం చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, గుండె భాగంలో పట్టేసినట్టు ఉండి గుండె దడగా ఉండడం వంటి లక్షణాలు కొందరిలో కనిపిస్తాయి. ఒక్కొక్కసారి మాట తీరు స్పష్టంగా లేకపోవడం, తీవ్రమైన దగ్గు, గొంతు పట్టేసినట్టు అనిపించడం లక్షణాలు కూడా కొందరిలో కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలోని గుండె వైద్య నిపుణులను సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మంచిది. గ్యాస్టిక్, ఎసిడిటీ సమస్యలు కూడా గుండె పోటుకు పరోక్ష కారణాలు అన్నది గుర్తుంచుకోవాలి.