అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో అవిసె చెట్టు కూడా ఒకటి. ఈ మొక్కను సంస్కృతంలో అగస్త్య చెట్టు అని పిలుస్తారు. అవిసె చెట్లను పొలం గట్ల వెంబడి లేదా తమలపాకు తోటల్లో తమలపాకు తీగలను అల్లించడానికి ఎక్కువగా పెంచుకుంటారు.
భారతీయ ఆయుర్వేదంలో అవిసె చెట్టు ఆకులు, పువ్వులు, గింజలు, వేర్లను ఉపయోగించి అనేక మొండి వ్యాధులను నయం చేయడంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అవిసె ఆకులను, పువ్వులను కూరగా ను, లేదా పప్పులో వేసుకొని తినవచ్చు. అవిసె పువ్వుల రసాన్ని తీసి వాడుకోవచ్చు. అవిసెను ఆహారంగా తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చిన్నపిల్లల్లో కడుపులో నులి పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పిల్లలు తరచూ అనారోగ్యంతో బాధపడుతుంటారు. నులి పురుగు సమస్యను తొలగించుకోవడానికి అవిసె ఆకుల రసాన్ని తీసి అందులో కొద్దిగా తేనెను కలిపి తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
అవిసె గింజలను చూర్ణంగా చేసి ప్రతిరోజు ఆవుపాలతో కలిపి ఉదయం సాయంత్రం సేవిస్తే మెదడు చురుగ్గా పనిచేసే జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.రేచీకటి సమస్యతో బాధపడేవారు అవిసె ఆకులను మెత్తగా దంచిఆ మిశ్రమాన్ని కుండలో
పోసి ఉడకబెట్టాలి.అందులో నుంచి రసాన్ని తీసి సేవిస్తే రేచీకటి సమస్య తొలగిపోతుంది.
మూత్రం పోసినప్పుడు మంట, మూత్రం ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు అవిసె ఆకు కషాయాన్ని సేవిస్తే మూత్రపిండాల పనితీరు మెరుగుపడి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. విరోచనాలతో బాధపడేవారు అవిసె చెట్టు బెరడును కషాయంగా మార్చి సేవిస్తే విరేచనాల సమస్య తగ్గుతుంది.
కీళ్ల నొప్పులు సమస్యతో బాధపడేవారు అవిసి ఆకులను లేదా పువ్వులను మెత్తని చూర్ణంగా మార్చి నొప్పి ఉన్న ప్రదేశంలో పట్టుగా వేసుకుంటే కీళ్లనొప్పి సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. గవద బిల్లలు, చర్మంపై దద్దర్లు వంటి సమస్యలతో బాధపడే వారికి అవిసె ఆకుల చూర్ణం చర్మంపై రాసుకుంటే అన్ని రకాల చర్మ సమస్యలు తొలుగుతాయి.