చలికాలంలో ఈ లడ్డు తింటే చాలు ఈ సీజన్ మొత్తం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండొచ్చు తెలుసా?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు రోజువారి ఆహారంలో తప్పనిసరిగా చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్య నిపుణులు స్పష్టం చేస్తూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. చిరుధాన్యాల్లో కేలరీలు, కొవ్వు నిల్వలు తక్కువగా ఉండి ప్రోటీన్స్, విటమిన్స్, మినిరల్స్, ఫైబర్ పుష్కలంగా లభిస్తుండడంతో మన సంపూర్ణ ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి.

ముఖ్యంగా రాగి చిరుధాన్యంలో అత్యధికంగా ఐరన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ ఏ, డీ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.కావున వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే శీతాకాలం లాంటి సీజన్లలో తరచూ రాగి చిరుధాన్యంతో తయారు చేసే లడ్డూలను, రాగి జావా, రాగి రొట్టెలు, రాగి సంగటి వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తింటే మనలో ఇమ్యూనిటీ బూస్టర్ గా సహాయపడుతుంది. మరియు రక్తహీనత సమస్యను తొలగించి అలసట, నీరసం వంటి లక్షణాల నుంచి బయటపడవచ్చు. ఎముకలు దంతాలు దృఢంగా తయారవుతాయి. రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించబడి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. రాగుల్లో అత్యధికంగా ఫైబర్ లభ్యమవుతుంది కావున శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రించబడి అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రాగులతో లడ్డూలను తయారు చేసుకుంటే మనకు ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు లడ్డులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా రాగులలో కాసింత నెయ్యి వేసి దోరగా వేయించుకున్న తర్వాత పొడిగా మార్చుకోవాలి. తర్వాత అందులోకి యాలకుల పొడి, చక్కర, రుచి కోసం బాదాం పప్పులు పల్లీలు, కొబ్బరినూ కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత నెయ్యి వేసుకొని చిన్నచిన్న ఉండలుగా తయారు చేసుకుంటే రుచికరమైన రాగి లడ్డులు తయారైనట్టే. ఈ లడ్డులను గాజు జారులో నిల్వ చేసుకొని మనకి ఇష్టం వచ్చినప్పుడు తింటూ ఉంటే సంపూర్ణ పోషకాలు మన శరీరానికి లభించి మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది.