ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఉంటున్నారని అనేక సర్వేల్లో వెల్లడైంది. షుగర్ వ్యాధికి కారణాలు ఏవైనాప్పటికీ ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం తప్ప వ్యాధి నుంచి బయటపడడం దాదాపు అసాధ్యమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవాలంటే రోజువారి ఆహారంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటే కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామాలు అలవాటు చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే రక్తంలో చక్కెర శాతం మోతాదుకు మించి పెరిగి క్రమంగా ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, లివర్ అవయవాల పనితీరు మందగించి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
షుగర్ వ్యాధిగ్రస్తులు రోజువారి ఆహారంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రించబడి షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అయితే చాలామంది షుగర్ పేషెంట్లు చేసే పొరపాటు ఏమిటంటే ఉదయం సాయంత్రం గోధుమపిండితో తయారుచేసిన రోటీలను, చపాతీ, పూరిలను ఎక్కువగా తింటుంటారు. దీనివల్ల వారికి తెలియకుండానే షుగర్ వ్యాధి నియంత్రణ అదుపు తగ్గుతుంది కారణం గోధుమ పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండి రక్తంలో చక్కెర నిల్వలను అమాంతం పెంచేస్తుంది. కనుక షుగర్ వ్యాధిగ్రస్తులు గోధుమపిండి రోటీలకు బదులు జొన్న రొటీలు, రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు వంటివి ఆహారంగా తీసుకుంటే సరిపోతుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులు రోజువారి ఆహారంలో జొన్న, రాగి, సజ్జ రోటీలను ఎక్కువగా తీసుకుంటే ఇందులో అత్యధికంగా ఉండే పీచు పదార్థం తిన్న ఆహారాన్ని నిదానంగా జీర్ణం చేసి రక్తంలో గ్లూకోస్ నిల్వలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దాంతో షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంచుతుంది. అలాగే చిరుధాన్యాల్లో సమృద్ధిగా లభించే ప్రోటీన్స్, విటమిన్స్, కాల్షియం ,ఐరన్ మెగ్నీషియం వంటి మూలకాలు, కండరాలను, ఎముకలను దృఢంగా ఉంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో సహాయపడతాయి.