ఈ రోజుల్లో చాలామంది రోజువారి ఆహారంలో ఓట్స్ తినడానికి మక్కువ చూపిస్తున్నారు. ముఖ్యంగా అల్పాహారం మరియు స్నాక్స్ రూపంలో ఓట్స్ ను ఆహారంగా తీసుకుంటే మన నిత్య జీవక్రియలకు అవసరమైన అదనపు పోషక విలువలను సహజ పద్ధతిలో పొందవచ్చునని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. అయితే చాలామంది ఓట్స్ ఆహారంగా తీసుకోవడానికి సంకోచిస్తుంటారు కారణం వీటిని తింటే తొందరగా శరీర బరువు పెరగడంతో పాటు రక్తంలో చక్కెర గ్లూకోస్ స్థాయి పెరిగి డయాబెటిస్ వ్యాధి ప్రమాదం పొంచి ఉంటుందని భావించడమే. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు ఓట్స్ ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ , కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించబడుతుంది.ముఖ్యంగా ఓట్స్‌లో అమైనో ఆమ్లాల, బీటా గ్లూకాన్ అనే శక్తివంతమైన కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ఉబకాయం, రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని నుంచి మనల్ని కాపాడుతాయి. అలాగే ఓట్స్ లో సమృద్ధిగా లభించే డెంటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం గ్యాస్ట్రిక్ అజీర్తి వంటి లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
ఓట్స్ లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్, శక్తివంతమైన ఫైబర్ బీటా-గ్లూకాన్‌తో సహా పిండి పదార్థాలు రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే క్యాల్షియం, ఫాస్పరస్ పొటాషియం వంటి మూలకాలు కండరాలు, ఎముకల దృఢత్వానికి సహాయపడతాయి. ఓట్స్లో సమృద్ధిగా లభించే ఐరన్ ,విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపక శక్తిని పెంపొందించే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ మెగ్నీషియం వంటి ఎన్నో పోషక విలువలు ఓట్స్లో సమృద్ధిగా లభిస్తాయి.