సాధారణంగా ఉదయం సాయంత్రం ఒక గ్లాసుడు పాలు తాగడం మనందరికీ అలవాటే. ప్రతిరోజు పాలు తాగడం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని సూక్ష్మ స్థూల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పాలల్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ , విటమిన్ డి, ప్రోటీన్స్ సమృద్ధిగా లభించి మనల్ని శారీరకంగాను మానసికంగానూ దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగని మరీ ఎక్కువ పాలు తాగితే వీటిలో సమృద్ధిగా ఉండే కొవ్వు పదార్థాలు, క్యాలరీలు, ప్రోటీన్స్ జీర్ణం అవడంలో ఆలస్యమై అజీర్తి గ్యాస్టిక్, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు.
సాధారణంగా పాలల్లో చక్కెర కలుపుకొని తాగడం మనందరికీ అలవాటు అయితే చక్కెరకు బదులు పాలల్లో బెల్లం కలుపుకొని రాత్రి పడుకునే ముందు సేవిస్తే అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొంద వచ్చునని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పని ఒత్తిడి కారణంగా అలసట, నీరసం వంటి సమస్యలతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు బెల్లం కలిపిన పాలను ప్రతిరోజు సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న సహజ యాంటీ ఆక్సిడెంట్ మానసిక ఒత్తిడిని తొలగించి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. అలాగే బెల్లం లో సమృద్ధిగా ఉండే ఫైబర్ మనం తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం అవ్వడానికి సహకరించి సుఖప్రదమైన నిద్రను కలిగిస్తుంది.
ప్రతిరోజు బెల్లం కలిపిన పాలను సేవించడం వల్ల మన శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్ ,సెలీనియం, జింకు వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఎముకలు ,కీళ్లు దృఢంగా ఉండునట్లు చేస్తుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. మలబద్ధకం, అతి బరువు సమస్యతో బాధపడేవారు బెల్లం కలిపిన పాల పానీయాన్ని సేవిస్తే జీర్ణ వ్యవస్థ మెరుగుపడడమే కాకుండా రక్తంలోని చెడు మలినాలను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పాలలో చక్కెర కలుపుకొని సేవిస్తే రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పెరిగిపోయే ప్రమాదం ఉంది కావున పాలల్లో చక్కరకు బదులు బెల్లం కలుపుకొని సేవించడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.