సమ్మర్ స్పెషల్.. ‘తాటి ముంజ’తో చల్లదనం.. ఆరోగ్యం కూడా..!

వేసవి వచ్చిందంటే మండే ఎండలు, పెరిగే ఉష్ణోగ్రతలు, ఉక్కపోత, బాడీ హీట్.. ఇవన్నీ చికాకు తెప్పిస్తాయి. ఈ సమయంలో బాడీలో హీట్ తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. మంచినీళ్లు, కూల్ డ్రింక్స్, మజ్జిగ, సుగంధి, కొబ్బరినీళ్లు.. ఇలా రకరకాలుగా శరీర ఉష్ణోగ్రతలను చల్లబరచుకుంటాం. అయితే.. ఇదే వేసవిలో సీజనల్ గా దొరికే తాటి ముంజలు కూడా శరీరానికి చలవ చేస్తాయి. తాటి ముంజులు రహదారి పక్కన చెట్ల నీడన విక్రయిస్తూంటారు. ఎండవేడి నుంచి వచ్చి నీడలో ముంజలను తింటే అప్పటివరకూ ఉన్న శరీర వేడి పోవడమే కాదు.. మళ్లీ ఎండల్లోకి వెళ్లినా తట్టుకునే శక్తి లభిస్తుంది.

ముంజుల్లోని నీరు, ముంజ ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎండ వేడి నుంచి వచ్చి వీటిని తీసుకుంటే శరీరానికి చల్లదనమే కాదు.. మానసిక ఆనందం కూడా వస్తుంది. మండే ఎండల్లో మన ఆరోగ్యాన్ని కాపాడటంలో తాటి ముంజులు ఉత్తమమైనవి. ప్రకృతి ప్రసాదించిన ముంజల్లో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. విటమిన్ ఎ, బి, సి, ఐరన్, జింక్, పాస్ఫరస్, ఉండటంతో శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇవన్నీ శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు వెలుపలికి వచ్చేలా చేస్తాయి. తరిమేస్తాయి. నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీర ఉష్ణోగ్రతను చల్లబరుస్తుంది.. ఎండ వేడి తగిలినా వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.

ముంజల్లో ఎక్కువగా ఉండే పొటాషియం రక్తపోటు అదుపులో ఉంచుతుంది. చెడు కొలస్ట్రాల్ పోయి మంచి కొలస్ట్రాల్ వృద్ధి చెందడం ద్వారా గుండె ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది. శరీర బరువును తగ్గించడంలో సాయపడుతుంది. ముంజుల వల్ల లివర్ సమస్యలు కూడా తొలగుతాయి. ముంజలు ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్తి, ఎసిడిటీ రాకుండా చేస్తుంది. వికారం, వాంతులను నివారిస్తుంది. మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే రొమ్ము క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తుంది. వేసవిలో ఎక్కువగా వచ్చే పొంగు నుంచి శరీరాన్ని చల్లగా ఉంచుతూ ఉపశమనాన్ని ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ముంజలను ఓ పట్టు పట్టండి..!

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.