Cinnamon Tea: రోజూ రెండు కప్పుల దాల్చిన చెక్క టీ..! ఉపయోగాలెన్నో..!!

Cinnamon Tea: ‘ఈ చాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఈ చాయ్ చమక్కులే.. చూడరా భాయ్..’ అని మెగాస్టార్ చిరంజీవి మృగరాజు సినిమాలో పాట పాడారు. ఆ పాటలో అప్పటికి టీలో ఎన్ని ఫ్లేవర్లున్నాయో వివరించారు. కాలానుగుణంగా మరెన్నో ఫ్లేవర్లు వచ్చాయి. వాటిలో ‘దాల్చిన చెక్క టీ’ ఒకటి. సుగంధ ద్రవ్యాలకు చెందినది కావడంతో టీ మంచి టేస్టీగానూ ఉంటుంది.. మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

దాల్చిన చెక్కను టేస్ట్ కోసం బిర్యానీలో, మసాలాతో చేసే కూరల్లో వాడతారు. అయితే.. దాల్చిన చెక్క టీ కూడా తాగొచ్చు. ఔషధ గుణాలు ఉండటం వల్ల దాల్చిన చెక్క టీతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గేలా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.. మంచి కొవ్వును పెంచుతుంది. బీపీ కంట్రోల్ చేస్తుంది. కడుపులో మంటను పోగొడుతుంది. నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగేలా చేస్తుందని నిపుణులు తేల్చారు.

వీడు త్వరగా ముసలోడు కాకూడదే అని ఉప్పెన సినిమాలో హీరోయిన్ చెప్పినట్టు జరగాలంటే కూడా దాల్చిన చెక్క టీ చేస్తుంది. చర్మంపై ముడతలు, ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా దాల్చిన చెక్క టీ చేస్తుంది. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవన్నీ రకరకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. షుగర్, కాన్సర్, గుండె జబ్బులు, చర్మ కణాలు దెబ్బతినడం వంటి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. మతిమరుపు సమస్యను తగ్గించి.. బ్రెయిన్ చురుకుగా ఉండేలా చేస్తుంది. హెచ్ఐవీ వైరస్‌తో పోరాడే శక్తినిస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది.

తక్కువ దాల్చిన చెక్క పొడితో టీ చేసుకుని తాగితే పై ఉపయోగాలు కలుగుతాయి. ఓ కప్పు వేడి నీటిలో దాల్చిన చెక్క పొడి (2.6 గ్రాములు), పంచదార వేసి కలపాలి. దాన్ని ఫిల్టర్ చేసుకుని తాగాలి. వేడిగా, చల్లార్చి తాగినే అదే ఫలితం ఉంటుంది. అలా కాకుండా.. దాల్చిన చెక్కలను వేడి నీటిలో 10-15 నిమిషాలు ఉంచి ఆ నీరు తాగినా మంచి ప్రయోజనం ఉంటుంది.

అయితే.. దాల్చిన చెక్క టీ టేస్టీగా ఉందని ఎక్కువ తాగకూడదు. రోజుకు రెండు కప్పులు మించి తాగితే లివర్ పని చేయడంలో సమస్యలు వస్తాయి. గాయమైతే రక్తం త్వరగా గడ్డ కట్టదు.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.