Winter Food: చలికాలంలో ఈ ఆహారాలు డైట్‌లో యాడ్ చేస్తే మీ హార్ట్‌ సేఫ్‌.. గుండె జబ్బులు దరిచేరవు..!

చలి మొదలవగానే మనం వేడి దుప్పట్లు, చాయ్, సూప్‌లను ఆశ్రయిస్తాం. కానీ ఈ సీజన్‌లో ఒక పెద్ద సమస్య ఏమిటంటే.. శరీర కదలిక తగ్గిపోవడం. ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగి గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అందుకే చలికాలంలో బాడీని వేడిగా ఉంచడమే కాకుండా, హార్ట్‌ హెల్త్‌ను మెరుగుపరిచే ఫుడ్స్‌ తినడం చాలా ముఖ్యం. చలికాలంలో దొరికే కొన్ని సహజమైన ఆహారాలు గుండెకు అద్భుతమైన రక్షణగా నిలుస్తాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌ హార్ట్‌ హెల్త్‌ కోసం పనిచేస్తాయి.

ఉదయం గుప్పెడు నట్స్‌ బాదం, వాల్‌నట్స్‌, జీడిపప్పు, అవిసెలు.. తింటే రక్త నాళాలు శక్తివంతంగా మారుతాయి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు బాడీ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి. ఫైబర్, మెగ్నీషియం గుండె పనితీరును బలపరుస్తాయి. ఇక చలికాలంలో ఆకుకూరలు తినడం చాలా మంచిది. పాలకూర, తోటకూర వంటి వాటిలో విటమిన్ A, C, K తో పాటు ఫోలేట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇవి బ్లడ్ ప్రెజర్‌ కంట్రోల్‌లో ఉంచి, ధమనులను శుభ్రపరుస్తాయి.

వీటితో పాటు దానిమ్మపండు కూడా వింటర్‌లో హార్ట్‌ ఫ్రెండ్లీ ఆహారం. ఇందులోని పాలీఫెనాల్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడతాయి. ప్రతి రోజు దానిమ్మ తింటే బ్లడ్ సర్క్యులేషన్‌ మెరుగుపడి హార్ట్ అటాక్ ముప్పు తగ్గుతుంది. అంతేకాదు నారింజ కూడా చలికాలంలో తప్పనిసరిగా తినాల్సిన పండు. ఇందులో ఉండే విటమిన్ C, పొటాషియం, ఫైబర్‌ గుండె ఆరోగ్యానికి బూస్ట్ ఇస్తాయి. పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది, ఫైబర్‌ చెడు కొలెస్ట్రాల్‌ని అడ్డుకుంటుంది.

క్యారెట్‌లో ఉన్న బీటా కెరోటిన్‌, ఫైబర్‌, పొటాషియం గుండెను బలంగా ఉంచుతాయి. రా క్యారెట్‌ తిన్నా, సూప్‌లలో వేసుకున్నా అదే లాభం. ఇవి బీపీని కంట్రోల్‌లో ఉంచి కొలెస్ట్రాల్‌ తగ్గిస్తాయి. వెల్లుల్లి కూడా గుండె ఆరోగ్యానికి సూపర్ ఫుడ్‌గా గుర్తించబడింది. ఇందులోని అల్లిసిన్‌ అనే పదార్థం రక్త నాళాలను కాపాడి, చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గిస్తుంది. పచ్చిగా తిన్నా, కూరల్లో వేసుకున్నా హార్ట్‌ హెల్త్‌ మెరుగుపడుతుంది.

బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్త నాళాలను సడలిస్తాయి. దీంతో రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఫ్రీ రాడికల్‌ డ్యామేజ్‌ నుంచి కాపాడుతాయి. మొత్తానికి, ఈ చలికాలంలో వేడి దుప్పట్లకే కాదు, గుండెకు వేడి అందించే వింటర్ ఫుడ్స్‌కూ ప్రాధాన్యం ఇవ్వండి. నట్స్‌ నుంచి ఆకుకూరలు, దానిమ్మ నుంచి వెల్లుల్లి వరకు డైట్‌లో చేర్చుకుంటే మీ హార్ట్‌ ఈ వింటర్‌లో కూడా హ్యాపీగా మోగుతుంది. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)