తంగేడు పూలల్లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే?

ఆయుర్వేద వైద్యంలో తంగేడు మొక్క ఆకులు, పూలు బెరడు, వేర్లకు అధిక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను సరైన పద్ధతిలో వినియోగిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందమైన పసుపు రంగు పూలతో తంగేడు మొక్క పొలం గట్ల వెంబడి అడవి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పుష్పాల్లోని ఔషధ గుణాలు గ్రహించిన మన పూర్వీకులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ , బతుకమ్మ పండుగ సమయంలో ఈ పూలను ఇంటికి తెచ్చుకొని దేవునికి సమర్పించడం జరుగుతుంది.

తంగేడు పూలల్లో ఉన్న ఔషధ గుణాలు చర్మ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. తంగేడు పూల పొడిని ముల్తానీ మట్టిలో కలుపుకొని ముఖంపై ఫేస్ ప్యాక్ లా ఉపయోగిస్తే చర్మం పై ఉండే మృత కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. తంగేడు పూల కషాయాన్ని సేవిస్తే మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ సమర్థవంతంగా తొలగిస్తుంది. వక్కపొడి, తంగేడు పూలను బాగా మరిగించి వచ్చిన కషాయాన్ని డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు సేవిస్తే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అతి మూత్రం సమస్యతో బాధపడేవారు తంగేడు విత్తనాల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.

తంగేడు వేర్లను లేదా బెరడును బాగా మరిగించి వచ్చిన కషాయాన్ని సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీ మైక్రోబియన్ గుణాలు పొట్టలో ఉన్న వ్యాధికారక సూక్ష్మజీవులను నశింపజేసి విరేచనాలను, డయేరియా సమస్యను కూడా తగ్గిస్తుంది. తేలు కుట్టినప్పుడు లేత తంగేడు ఆకులను బాగా దంచి తేలు కుట్టిన చోట కట్టు కడితే విష ప్రభావం తగ్గి తొందరగా ఉపశమనం లభిస్తుంది. తీవ్రమైన దగ్గు సమస్య ఉన్నవాళ్లు తరచూ లేత తంగేడు ఆకులను నమిలి మింగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పాదాల పగుళ్ల సమస్యతో బాధపడేవారు తంగేడు ఆకులను మజ్జిగతో కలిపి మెత్తటి మిశ్రమంగా మార్చిన తర్వాత పాదాలపై మర్దన చేసుకుంటే సున్నితమైన పాదాలు మీ సొంతం అవుతాయి.