నోటి అల్సర్ సమస్యతో ఇబ్బందిగా ఉందా? ఈ సులువైన చిట్కాలు మీకోసమే?

ఈరోజుల్లో చాలామంది తరచూ నోటి పూత సమస్యతో బాధపడుతున్నారు.నోటి పూత సమస్యనే నోటి అల్సర్లు అని కూడా పిలుస్తారు. నోటి పూత సమస్య తలెత్తినప్పుడు పెదవుల కింద, నాలుక, దవడ భాగంలో చిన్న చిన్న గాయాలు, పొక్కులు, పుండ్లు వంటివి ఏర్పడి ఆహారం తీసుకోవాలన్న, నీళ్లు తాగాలన్న, చివరకు మాట్లాడాలన్నా తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. తద్వారా నోట్లో ఇన్ఫెక్షన్ ప్రారంభమై దంత క్షయం, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన వంటి సమస్యలు కూడా కొందరిలో తలెత్తుతాయి.

అసలు నోటి అల్సర్లు రావడానికి గల కారణాలను పరిశీలిస్తే విటమిన్ సి, విటమిన్ బి12,జింక్, ఐరన్,
పోలీక్ ఆమ్లం వంటి పోషకాలు లోపించడం వల్ల వస్తుంది మరికొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా నోటిపూత సమస్య తలెత్తవచ్చు. మరికొందరిలో నిమ్మ, బత్తాయి, నారింజ, యాపిల్, టొమాటో, స్ట్రాబెర్రీ, ఫైన్ ఆపిల్ లాంటి సిట్రస్ జాతి పండ్లను ఎక్కువగా తిన్నప్పుడు వీటిలో ఉండే ఆమ్ల గుణాల కారణంగా కొందరిలో అలర్జీ సమస్య తలెత్తి నోటి అల్సర్ కు కారణం కావచ్చు.

నోటి పూత వల్ల తలెత్తే బాధకు తక్షణ ఉపశమనం పొందాలంటే మన ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించవచ్చు. నోటి పూత సమస్య తలెత్తిన వారు తరచూ మంచినీళ్లను తాగుతూ ఉండాలి తద్వారా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉండదు మరియు శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించుకోవచ్చు. యాంటీ మైక్రోబియనల్ గుణాలు పుష్కలంగా ఉన్న తేనె పసుపు మిశ్రమాన్ని కలిపి నోట్లో పుండ్లు ఉన్నచోట సున్నితంగా రాసుకుంటే పుండ్లు తొందరగా తగ్గి బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు.

మనందరి ఇంటి పెరట్లో ఉండే తులసి మొక్కతో నోటిపూతకు చెక్ పెట్టవచ్చు. రోజుకు రెండు మూడు సార్లు నాలుగు తులసి ఆకులను నమిలి మింగితే మంచి ఫలితం ఉంటుంది. లేదా తులసి రసంలో పసుపు ఉప్పు కలిపి ఆ కషాయంతో నోటిని శుభ్రం చేసుకుంటే తొందరగా ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.నోటి పూత వచ్చిన వారు లవంగం, యాలకులు నవలడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మరియు శుద్ధిచేసిన కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని పుక్కిలిచ్చి బయటికి ఉమ్మి వేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే నోటి పూత సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.