ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఈ ఉరుకుల పరుగుల జీవితంతో పరుగులు తీస్తున్నారు ఈ క్రమంలోనే సరైన సమయానికి తినడం నిద్రపోవడం వంటివి పూర్తిగా మానేసి వీలు దొరికినప్పుడు తినడానికి నిద్ర పోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే విద్య ,ఉద్యోగం అంటూ అర్ధరాత్రి వరకు మేలుకొనే వారి సంఖ్య కంటే టీవీలు చూస్తూ, మొబైల్స్ పట్టుకుని సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ తెల్లవారుజాము వరకు మేల్కొని వారి సంఖ్య ఎక్కువగా ఉందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
ఇలా ప్రతిరోజు టీవీ, మొబైల్స్ చూస్తూ అర్ధరాత్రి వరకు మేల్కొనే వారిలో నిద్రలేమి సమస్యలతో పాటు దీర్ఘకాలంలో కంటి సమస్యలు, గుండె జబ్బులు, డయాబెటిస్, జీర్ణ సంబంధిత వ్యాధులు, సైకలాజికల్ సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. కావున ఇప్పటికైనా మేల్కొని సుఖప్రదమైన నిద్ర కోసం కొన్ని నియమాలను పాటించండి..వైద్యుల సూచనల ప్రకారం మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరి. కాబట్టి మనం చదువుకోవడానికి, ఆడుకోవడానికి ,భోజనం చేయడానికి ఎలాగైతే సమయాన్ని కేటాయించి పాటిస్తామొ అలాగే నిద్రపోవడానికి కూడా ఒక సమయాన్ని నిర్ణయించుకోవడం తప్పనిసరి. రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందే భోజనం చేసి ఒక గ్లాసు పాలు తాగడం ఉత్తమం.
రాత్రి సమయాలలో ఎక్కువసేపు ఎలక్ట్రానిక్ డివైస్లను చూస్తూ ఉండటం వల్ల మనకు నిద్ర కలిగించే మెలటోనిన్ అనే రసాయనం ఉత్పత్తిని తగ్గిస్తుంది. దాంతో నిద్రలేమి సమస్యకు దారి తీయవచ్చు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే పడుకోవడానికి కొన్ని గంటల ముందు ఎలక్ట్రానిక్ డివైస్లను మూసివేయాలి. అదేవిధంగా మనం నిద్రపోయే గది కాస్త అందంగా అలంకరించుకోవడం వల్ల ప్రశాంతత కలిగి తొందరగా నిద్ర రావడానికి కారణం అవుతుంది. ఇక సాయంత్రం సమయంలో తింటానే పడుకోవడానికి ఆసక్తి చూపుతారు అలా కాకుండా కాస్త వాకింగ్ చేయడం వంటివి చేయడం వల్ల తొందరగా నిద్ర వస్తుంది. దీంతో నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు.