ఒక్కసారిగా బిగుసుకుపోయే జబ్బుతో రవితేజ

తమ పాత్రకి ఏదో ఒక డిజార్డర్ ఉంటే కథలో అది కీలకమౌతుందని హీరోలు నమ్ముతున్నారు. ఆ డిజార్డర్ తెరపై పండితే దాని గురించి జనం మాట్లాడుకుని సినిమాని హిట్ చేస్తారు. రొటీన్‌ సినిమాలు చేస్తూ కూర్చుంటానంటే థియేటర్లకి జనం కదిలిరారని ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా సినిమాలు ప్రూవ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న రవితేజ ది కూడా అదే పరిస్దితి.

ఈ మధ్యనే పగ , ప్రతీకారం మార్క్ సినిమా అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రానికి మినిమం కలెక్షన్స్ రాకపోయే సరికి మాస్‌ మహారాజా జాగ్రత్త పడుతున్నాడు. అందులో భాగంగా తాజా చిత్రంలో తన పాత్రకు డిజాస్డర్ ఉంటే ఓకే చేసారు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ‘డిస్కోరాజా’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

వైవిధ్యమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోందని తెలుస్తోంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రీకొడుకులుగా రెండు విభిన్నమైన పాత్రల్లో ఆయన తెరపై కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రల్లో ఒక పాత్రకి విచిత్రమైన ఒక డిజార్డర్ వుంటుందట. కీలకమైన సమయాల్లో ఆ పాత్ర ఒక్కసారిగా బిగుసుకుపోతుందట.

దాంతో ఆ పాత్రకి గల ఆ డిజార్డర్ .. కథ ఎలాంటి మలుపులు తిరగడానికి కారణమవుతుంది? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అనేది చాలా ఆసక్తికరంగా వుంటుందని తెలుస్తోంది. డిస్కోరాజా చిత్రం కోసం మొదటిసారిగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి, గెటప్‌ ఛేంజ్‌కి రవితేజ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజ వివిధ గెటప్స్‌లో కనిపించనున్నారు వేరియేషన్స్‌ కోసం దర్శకుడు ఆనంద్‌ పలు స్కెచ్‌లు రెడీ చేసి ఇచ్చాడట. రవితేజ సరసన హీరోయిన్స్ గా పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ .. ప్రియాంక జవాల్కర్ నటిస్తున్నారు.