పదవిని ఓ బాధ్యతగా నాయకులు స్వీకరించే పరిస్థితులు కనిపించడంలేదు. పదవి అంటే, అదొక గర్వం. పదవి వచ్చిదంటే, చాలు తమను తాము ‘అతి’గా ఊహించుకోవడం మొదలు పెడుతున్నారు కొందరు నేతలు. ఇటీవల వడ్డెర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా పదవి దక్కించుకున్న వైసీపీ మహిళా నేత రేవతి, ఆ పదవీ ప్రమాణ స్వీకారం చేయకుండానే వివాదాల్లో ఇరుక్కున్నారు. గుంటూరు జిల్లాలోని కాజా టోల్‌గేట్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు కాస్తా, రెగ్యులర్‌గా వెళ్ళాల్సిన ‘చెల్లింపు’ లేన్‌లో కాకుండా, వేరే లేన్ వైపుకి మళ్ళింది. ఈ క్రమంలో టోల్ ప్లాజా సిబ్బంది అడ్డు తగిలితే, ఆ సిబ్బందిపై దాడికి దిగారామె. ఈ గొడవ కాస్తా నేషనల్ మీడియాకీ ఎక్కింది. కీలకమైన పదవుల్లో వున్నవారి బాధ్యతారాహిత్యం గురించి దేశమంతా చర్చించుకుంటోందిప్పుడు.
తూచ్.. నన్నే వేధించారంటోన్న రేవతి
తనను టోల్ ప్లాజా సిబ్బంది ఇబ్బంది పెట్టారన్నది వైసీపీ నేత రేవతి చేస్తోన్న ఆరోపణ. తనన కొందరు రౌడీలు వేధించారనీ, మెడికల్ ఎమర్జన్సీ కారణంగా తాను ఫ్రీ లేన్‌లోకి వెళితే, అక్కడి సిబ్బంది అదేమీ పట్టించుకోకుండా తనను అడ్డుకున్నారనీ చెబుతున్నారు. పైగా, తాను లోకల్ అనీ, లోకల్‌లో తిరిగే వాహనాలకు టోల్ ఫీజు నుంచి వెసులుబాటు వుంటుందనీ, సంబంధిత కార్డుని కూడా ఆమె మీడియా ముందుంచారు. తానే ఈ ఘటనలో బాధితురాలినన్నది రేవతి వాదన.
సిబ్బందిపై చెయ్యి చేసుకోవడం నేరమే కదా.!
సరే, ఆమె పట్ల సిబ్బంది ఎలా వ్యవహరించారు.? అన్నది వేరే చర్చ. ఫ్రీ లేన్‌లోకి వచ్చి, సిబ్బందిపై దాడి చేయడం అనేది నేరమే కదా.! ఈ మేరకు టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. సంబంధిత వీడియో ఫుటేజ్‌లను కూడా పోలీసులకు అందించారు టోల్ ప్లాజా సిబ్బంది. అయితే, మహిళనని కూడా చూడకుండా తన పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ ‘మహిళా కార్డు’ తెరపైకి తెచ్చారు రేవతి.
వైసీపీ అధిష్టానం గుస్సా..
ఈ ఘటనపై వైసీపీ అధిష్టానం గుస్సా అవుతోంది. అధికారంలో వున్నాం గనుక, ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా వుండాలనీ, నాయకులు ‘అతి’ చేస్తే అది పార్టీకీ, ప్రభుత్వానికీ చెడ్డపేరు తెస్తుందనే భావనతో వున్న వైసీపీ అధిష్టానం, ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా రేవతిని ఆదేశించినట్లు తెలుస్తోంది. వ్యవహారం నేషనల్ మీడియా దాకా వెళ్ళిందంటే, అందులో రేవతి తప్పు వున్నట్లే కదా.? అన్నది అధిష్టానం భావనగా కనిపిస్తోంది.