తెలుగుదేశం నరాలను వణికిస్తున్న జగన్ ఢిల్లీ పర్యటన

YS Jagan meets PM Modi
మొన్న రెండు రోజులపాటు జరిగిన ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన విశేషాలకు తెలుగు మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు.  కానీ, జాతీయ మీడియా బాగానే కవర్ చేసింది.  అక్కడ జగన్ ఎలాంటి చర్చలు జరిపారో కొన్ని వివరాలను ప్రచురించాయి.  ఆ విశేషాలను తరువాతి పేరాల్లో చెప్పుకుందాం.  ముందుగా మన పచ్చ మీడియా లేకితనాన్ని చెప్పుకుందాము.
 
YS Jagan meets PM Modi
 
దాదాపు తొమ్మిది నెలల తరువాత దేశ ప్రధానమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో ముఖాముఖీ కూర్చుని మాట్లాడటం ఇదే ప్రధమం.  అంతే కాకుండా ఎంతో బిజీగా ఉండే ప్రధాని సుమారు యాభై నిముషాల సమయాన్ని ముఖ్యమంత్రికి కేటాయించడం తప్పకుండా చెప్పుకోదగిన విషయమే.  అయితే మన గజ్జి మీడియా మాత్రం తన కేసులగూర్చి ప్రధానితో మాట్లాడటానికి వెళ్లాడని, మంత్రివర్గంలో బెర్తులకోసం చర్చించాడని, హైకోర్టు మీద ఫిర్యాదులు చేశాడని, చంద్రబాబును జైలుకు పంపించడానికి ప్రయత్నిస్తున్నాడని ఊహాగానాలు అల్లేశాయి.  అలాగే న్యాయమూర్తుల మీద ఫిర్యాదులు చెబుతుంటే “అవన్నీ అమిత్ షా తో చెప్పారు గదా…ఇంకేమైనా ఉంటే చెప్పండి” అని ప్రధాని అన్నారని రాసి తమ పైత్యాన్ని ప్రదర్శించాయి.  అలాగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం చాలా వాడిగా వేడిగా సాగిందని, కేసీఆర్ జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారని, జగన్ వాదనలను తిప్పికొట్టారని, జగన్ ను బెదిరించారని అంటూ మరికొన్ని కథలు అల్లేశాయి.  అయితే అదే సాయంత్రం ఇద్దరు ముఖ్యమంత్రులూ సహకార ధోరణితో మాట్లాడారని, డిపిఆర్ లు ఇవ్వడానికి అంగీకరించారని, సుప్రీంకోర్టులో తెలంగాణా ప్రభుత్వం వేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి కేసీఆర్ అంగీకరించారని ప్రకటించారు.  కేంద్రమంత్రి చేసిన ప్రకటనలకు, మన మీడియా రాసిన రాతలకు అసలు ఎక్కడా పోలిక అందడం లేదు.  
 
ఇవే అంశాలతో జగన్ మీద దుమ్మెత్తిపోయడానికి తమ ఎల్లో దిగ్గజ విశ్లేషకులను కూర్చోబెట్టి తమ అక్కసును ప్రదర్శించాయి.  అయితే జాతీయ మీడియా మాత్రం “ప్రత్యేక హోదా ఇస్తేనే ఎన్డీయేలో చేరే ఆలోచన చేస్తామని, ప్రస్తుతం తమకు మంత్రిపదవులు వద్దు” అని జగన్ ఖండితంగా ప్రధానికి చెప్పినట్లు రిపోర్ట్ చేశాయి.   అలాగే ప్రాజెక్టులకు నిధులను కూడా విడుదల చెయ్యాలని కోరినట్లు ఆంగ్ల పత్రికలు రాయడం గమనార్హం.  
 
అయితే ఇక్కడ చెప్పుకోవలసింది ఏమిటంటే  కేంద్ర  ప్రభుత్వ అధినేత, రాష్ట్ర  ప్రభుత్వ అధినేత ఏకాంతంగా సుమారు యాభై నిముషాలపాటు మాట్లాడుకున్నప్పుడు వాటిలో రాజకీయ ప్రస్తావనలు  కూడా కచ్చితంగా ఉంటాయి.  ఎన్డీయేలో ఇద్దరు వైసిపి సభ్యులకు స్థానం, అలాగే చంద్రబాబు, లోకేష్ మీద సిబిఐ విచారణకు అనుమతులు కోరారని వస్తున్న వదంతులు  మాత్రం తెలుగుదేశం పార్టీలో కలవరాన్ని రేపుతున్నాయి.  ప్రస్తుతానికి బహిర్గతం కానప్పటికీ, అక్కడ జరిగిన చర్చల్లో ఈ అంశం కూడా చోటుచేసుకున్నది సమాచారం.    అదేగనుక జరిగితే చంద్రబాబుకు, లోకేష్ కు సింహస్వప్నంగా మారిన విజయసాయిరెడ్డి కచ్చితంగా కేబినెట్ మంత్రి అవుతారు.  అలాగే సిబిఐ కూడా తన విశ్వరూపాన్ని చూపిస్తుంది.  అక్కడ దోపిడీ జరగలేదని తెలుగుదేశం ఎంత బల్లగుద్ది వాదిస్తున్నప్పటికీ, విచారణ మొదలైతే ఆ ఆరోపణలు అబద్ధాలని నిరూపించుకోవడం చంద్రబాబు వంతు అవుతుంది.  చంద్రబాబును సిబిఐ అరెస్ట్ చేసినా చెయ్యవచ్చు.  విచారణ జరిగేది సిబిఐ కోర్టులో కాబట్టి చంద్రబాబును రక్షిస్తున్నారు అని భావించే అదృశ్యగంధర్వులు కూడా చేతులు ఎత్తేయవచ్చు.  ఇదే చంద్రబాబును, ఎల్లో మీడియాను భయభ్రాంతులకు గురిచేస్తున్నది.  అందుకే చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా జగన్ ఢిల్లీ పర్యటనను మసిపూసిమారేడుగాయ చెయ్యడానికి కృషి చేస్తున్నది.  జగన్ మీద బురద చల్లడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నది.  
 
ఇక  వైసిపికి  బీజేపీతో చెలిమి కుదిరితే  రాష్ట్రానికి అనేకవిధాలుగా ప్రయోజనం సమకూరుతుంది.  ప్రత్యేకహోదా గానీ, పాకేజీ గాని కేంద్రం ఇవ్వడం జరిగితే జగన్ ఖ్యాతి ఆకాశమే హద్దుగా పెరుగుతుంది.    ఒకటి రెండు ప్రాజెక్టులు, కొన్ని పరిశ్రమలు రావడం జరిగితే అది జగన్ కు పెద్ద మైలేజిని తెచ్చిపెడుతుంది.  కడప ఉక్కు కర్మాగారానికి నిధులు వస్తే లక్షలమందికి ఉపాధి లభిస్తుంది.  జగన్ ఆంధ్రప్రదేశ్ కు తిరుగులేని నాయకుడు అవుతాడు.  మరో పదిహేనేళ్ళు ఆయన్ను ఎవ్వరూ కదిలించలేరు.  మోడీ, అమిత్ షా  కూడా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నిలదొక్కుకోవాంటే అది జగన్ ను మంచి చేసుకోవడం ద్వారానే సాధ్యం అవుతుందని  గ్రహించారని సమాచారం.  ముఖ్యంగా జగన్ లోని విశ్వసనీయత అనే గుణం మోడీని ఆకర్షిస్తున్నది.  అంతేకాకుండా జగన్ చేపట్టిన అనేక సంస్కరణలు, వాలంటీర్ విధానం, గ్రామసచివాలయాలు సత్ఫలితాలను ఇస్తుండటం, వారి సహకారంతో కరోనాను ఎదుర్కోవడం మొదలైన అంశాలు కేంద్రాన్ని కూడా జగన్ పట్ల తమ అభిప్రాయాన్ని మార్చుకునేట్లు చేశాయి.  మోడీకి, జగన్ కు మధ్యన పొత్తు కుదిరితే తమ శేష జీవితం శ్రీకృష్ణజన్మస్థానంలోనే అని చంద్రబాబు, మరికొందరు స్థిరాభిప్రాయానికి వచ్చేసారు.  అందుకే పచ్చమీడియా ద్వారా జగన్ ఢిల్లీ పర్యటన పట్ల దిగజారుడు రాతలను ప్రచురింపజేస్తున్నారు.  కానీ, అరచేతులు అడ్డుపెట్టి సూర్యుడిని ఎంతసేపు ఆపగలం?  
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు