గతంతో పోల్చితే, ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌కి తుపాన్ల తాకిడి ఎక్కువైపోయింది. తుపాన్లు, భారీ వర్షాలు.. వీటికి తోడు వరదలు.. వెరసి, కనీ వినీ ఎరుగని రీతిలో నష్టం సంభవిస్తోంది. చంద్రబాబు హయాంలో అనావృష్టి.. వైఎస్ జగన్ హయాంలో అతివృష్టి.. అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఇదంతా ప్రకృతికి సంబంధించిన వ్యవహారం. పర్యావరణాన్ని మనం దెబ్బతీస్తున్నాం గనుక, ప్రకృతి ప్రకోపాన్ని చవిచూడాల్సి వస్తోంది. దేశంలోని తీర ప్రాంతాలన్నిటిదీ ఇదే దుస్థితి. తెలంగాణ లాంటి రాష్ట్రాలూ వరదల దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలకు తోడు రాజకీయ వైపరీత్యాలు ఎక్కువైపోతున్నాయన్నది నిర్వివాదాంశం. ‘మేం చాలా గొప్పగా చేసేస్తున్నాం..’ అని చెప్పని అధికార పార్టీని ఇప్పటిదాకా చూశామా.? పబ్లిసిటీ పీక్స్‌లో వుంటుంది.. పని, అత్యంత దారుణంగా వుంటుందన్నట్టు తయారైంది పరిస్థితి.
హెలికాప్టర్ సీఎం.. అప్పుడూ, ఇప్పుడూ.!
చంద్రబాబు హయాంలో వరదలొచ్చినా, తుపాన్లు వచ్చినా.. హెలికాప్టర్లు రయ్యిమని గాల్లోకి ఎగిరేవి. అధికారులు పరుగులు పెట్టేవారు. ముఖ్యమంత్రి అన్నాక, ఏరియల్ సర్వే నిర్వహించాలి కదా.! అయితే, అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టి, చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే చేశారన్న విమర్శ వుండేది. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా. హుద్‌హుద్ తుపాను సమయంలో, చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్లకు జనం ముక్కున వేలేసుకున్నారు. అయితే, ఆఘమేఘాల మీద అక్కడికి వెళ్ళి, పాలన అక్కడి నుంచే కొన్ని రోజులపాటు చేయడంతో విశాఖ కోలుకుందనేవారూ లేకపోలేదు. ఎవరి వాదనలు వారివి. ఒక్కటి మాత్రం నిజం.. ముఖ్యమంత్రి ఫీల్డ్‌లో వున్నా, లేకపోయినా.. పనిచేసేది మాత్రం అధికారులే. అందుకే, అధికారుల్ని వారి పని వారిని చెయ్యనివ్వాలి. ఇక, చంద్రబాబు ఎప్పుడూ హెలికాప్టర్‌లో చక్కర్లు కొట్టడం తప్ప, కిందికి దిగి.. రైతుల్ని పరామర్శించరా.? ప్రజల్ని కలవరా.? అని నిలదీసేశారు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. కానీ, ఇప్పుడు వైఎస్ జగన్‌కి తెలిసొస్తోంది.. ముఖ్యమంత్రి అంటే, నేల మీద అడుగు పెట్టడం కష్టమని. తన నివాసానికి కూతవేటు దూరంలో వరదలొస్తే, గ్రౌండ్ లెవల్‌లోకి వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శించలేకపోయారు వైఎస్ జగన్. రాయలసీమలో పలు జిల్లాలు తాజాగా వరద ముంపుకు గురైతే, అక్కడ కూడా ఏరియల్ సర్వేతో సరిపెట్టారు.
ఏకిపారేస్తున్న నెటిజన్లు..
వైఎస్ జగన్ చేస్తోన్న ఏరియల్ సర్వే తాలూకు వీడియోలకు, గతంలో చంద్రబాబు మీద వైఎస్ జగన్ ఈ ఏరియల్ సర్వే గురించి చేసిన వ్యాఖ్యల తాలూకు ఆడియోని మిక్స్ చేసి నెటిజన్లు సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు. ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ‘మా ముఖ్యమంత్రి చాలా గొప్ప.. ఆయన అధికారుల్ని సక్రమంగా పనిచేయనిస్తున్నారు. చంద్రబాబులా పబ్లిసిటీ స్టంట్లు చేయడంలేదు.. అధికారుల్ని ముప్పు తిప్పలూ పెట్టెయ్యట్లేదు.. ముఖ్యమంత్రి స్వయంగా బాధితుల వద్దకు వెళితే, భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో అధికారులకు తిప్పలు తప్పవు..’ అని వైసీపీ చెబుతోంది. మరి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడైనా అదే సమస్య కదా.. అన్న ప్రశ్న అధికార వైసీపీ మీద దూసుకొస్తోందిప్పుడు.
రాజకీయాల్లో ఇవన్నీ మామూలే.
అయితే, బాధిత ప్రజానీకం మాత్రం.. తమకు వరద సాయం సరిగ్గా అందట్లేదంటున్నారు. మంచి నీళ్ళను సైతం ప్రభుత్వం సమకూర్చలేకపోయిందని విమర్శిస్తున్నారు. ‘అప్పుడు పాదయాత్ర పేరుతో జనంలోకి వచ్చారు.. అధికారంలోకి వచ్చాక, జనాన్ని మర్చిపోయారు..’ అంటూ ఎక్కడికక్కడ వైఎస్ జగన్ మీద వరద బాధితులు విరుచుకుపడుతున్నారు. ఈ విషయంలో వైఎస్ జగన్ కాస్త, వరద బాధితుల ఆవేదనని కూడా అర్థం చేసుకుంటే మంచిదేమో. లేకపోతే, ఇదొక చారిత్రక తప్పిదం అయ్యే ప్రమాదముంటుంది.