పోలవరం ప్రాజెక్టు విషయమై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ‘ఉపదేశం’ చేశారు. చంద్రబాబు చేసిన తప్పిదాల్నే వైఎస్ జగన్ చేస్తున్నారంటూ ఉండవల్లి అసహనం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కేంద్రాన్ని నిలదీయాల్సిందేనని నినదించారు. ప్రాజెక్టు ఎత్తు విషయమై తలెత్తుతున్న గందరగోళానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. ఇంకేవేవో చెప్పేశారు. ప్రతి విషయంలోనూ కేంద్రం వద్ద రాజీ పడుతూ పోతోంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తవడం అసాధ్యమన్నారు. ‘చంద్రబాబు హయాంలో, ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగితే.. అప్పటి ప్రతిపక్ష నేతగా ఆరోపణలు చేశారు.. ఇప్పుడేమో, ఆ అంచనాల్నే ఆమోదించాలని కోరుతున్నారు..’
ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాల్ని తీసుకెళుతుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఏనాడో అస్త్ర సన్యాసం చేసేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్, ఈ తరహా ఉపదేశాలు చేయడం కొత్తేమీ కాదు. చంద్రబాబుని ఆయన విమర్శిస్తే, వైఎస్ జగన్ నుంచి ప్యాకేజీ తీసుకున్నట్టు.. వైఎస్ జగన్‌ని విమర్శిస్తే.. చంద్రబాబు, ఉండవల్లికి ప్యాకేజీ ఇచ్చినట్లు.. ఆయా పార్టీల సానుభూతిపరులు ఉండవల్లిని తిట్టిపోస్తుంటారు. అయినాగానీ, ఉండవల్లి తాను చెప్పాలనుకున్నది మాత్రం కుండబద్దలుగొట్టేస్తుంటారు.
నిజానికి, ఏ విషయాన్ని అయినా, ‘అరటి పండు తొక్క ఒలిచి నోట్లో పెట్టినట్లు’ చాలా స్పష్టంగా చెప్పడంలో ఉండవల్లి దిట్ట. ఆ మాటకొస్తే, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆయన చెబుతున్నవన్నీ వాస్తవాలే. పైగా, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అణువణువూ ఆయనకి తెలుసు. వైఎస్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయినప్పటినుంచీ, ఆ ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారాయన.. చేస్తూనే వున్నారాయన. ఆ మాటకొస్తే, వైఎస్ కంటే ముందు పోలవరం ప్రాజెక్టు గురించి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించిన ఘనుడు ఉండవల్లి అరుణ్‌కుమార్. కానీ, ఏం లాభం.? అన్నీ వున్నా అల్లుడి నోట్లో డాష్ డాష్ అన్నట్లు.. రాజకీయంగా ఉండవల్లికి ఇప్పుడు అంత సీన్ లేదు. అప్పుడప్పుడూ అలా మీడియా ముందుకొచ్చి, ఆయా అంశాలపై మాట్లాడుతుంటారు.. కానీ, ఎవరూ ఆయన్ని పట్టించుకోరు. ఆయనా, ఈ తరహా ఉపదేశాలు మానుకోరు.