ఆంధ్రా పాలకులంటే ఒంటికాలు మీద లేచే కేసీఆర్ ఒక్క జగన్ అంటేనే అభిమానం చూపుతుంటారు. ఏ ముఖ్యమంత్రితోనూ చేయని స్నేహం వైఎస్ జగన్ తో చేస్తుంటారు. జగన్ కూడ అంతే కేసీఆర్ అంటే ఎంతో గౌరవం చూపిస్తారు. ఇలా కొన్ని నెలలు ఇద్దరి నడుమ మంచి స్నేహం నడిచింది. ఈ స్నేహం జగన్ కు మేలు చేసిందో చేయలేదో తెలీదు కానీ కేసీఆర్ కు మాత్రం మంచే చేసింది. తెలంగాణ ఆయువుపట్టు ఆయిన హైదరాబాద్ నగరంలో ఆంధ్రా ప్రాంతం వ్యక్తుల సంఖ్య ఎక్కువే. రాష్ట్రం విడిపోయాక ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకునేవారు హైదరాబాద్ విడిచి వెళ్లిపోయారు కానీ వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు అక్కడే ఉండిపోయారు. వాళ్లలో చాలామందికి అక్కడ ఓటు హక్కు కూడ ఉంది.
రాష్ట్రం ముక్కలైందనే భావన మూలంగా కేసీఆర్ మీద కొంత కోపం ఉండేది వారిలో. కానీ ఎప్పుడైతే కేసీఆర్ వైఎస్ జగన్ తో దోస్తీ చేయడం స్టార్ట్ చేశారో అప్పటి నుండి వారి అభిప్రాయం కొంత మారింది. తెలంగాణలో వైసీపీ లేకపోవచ్చు కానీ హైదరాబాద్లోని ఆంధ్రా సెటిలర్లలో జగన్ అభిమానులు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా సీమ నుండి వెళ్లినవారు వైఎస్ జగన్ పట్ల విపరీతమైన అభిమానం చూపుతుంటారు. వారంతా కేసీఆర్ కు మద్దతుగా మారిపోయారు. కారణం జగన్, కేసీఆర్ దోస్తులు కాబట్టి. ఈ ప్రభావం రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో కనబడకపోవచ్చు కానీ గ్రేటర్ ఎన్నికల్లో తప్పకుండా కనిపిస్తుంది.
ఇన్నాళ్లు వైఎస్ జగన్ పట్ల కేసీఆర్ వ్యూ మంచిగా ఉంది కనుక జగన్ అభిమానులంతా తెరాసకు మద్దతు పలికారు. కానీ ఎప్పుడైతే జల వివాదం రేగిందో అది కాస్త సన్నగిల్లింది. అది చాలదన్నట్టు తాజాగా తెరాస మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 4 వేల కోట్లకు ఆశపడి వైఎస్ జగన్ మోదీ తెచ్చిన విద్యుత్ బిల్లును ఆమోదించారని, రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నారని అనేశారు. దీంతో రెండు రాష్ట్రాల మంత్రుల నడుమ మాటల యుద్దం నడిచింది. ఇలా తెరాస నేత వైఎస్ జగన్ ను కించపరుస్తూ మాట్లాడటం ఆయన అభిమానులకు ఏమాత్రం రుచించని అంశం. కాబట్టి రానున్న ఎన్నికల్లో వారంతా తెరాసకు వ్యతిరేకంగా ఇతర పార్టీలైన బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసే ప్రమాదం లేకపోలేదు. అంటే జగన్ ను తిట్టి హరీష్ రావు తెరాసకు నష్టం వాటిల్లే పరిస్థితిని తెచ్చారన్నమాట.