ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ మనుగడ అయినా ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తల కృషి మీద ఆధారపడివుంటుంది. గ్రామస్థాయిలో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, పోరాటాల సమయాల్లో పార్టీ జెండాను మోస్తూ నాయకుడి విజయం కోసం, పార్టీ విజయం కోసం రాత్రనక పగలనక శ్రమించే కార్యకర్తల వల్లనే పార్టీ జీవిస్తుంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో కనీసం ఒక్క శాసనసభ సీటు కూడా లేకపోయినా, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఏళ్లతరబడి బతుకుతున్నాయంటే అందుకు కారణం ఆ పార్టీకోసం పనిచేసే కార్యకర్తల బలమే. ఒక రాస్తా రోకో, ఒక ధర్నా, ఒక ఆందోళన అని పార్టీ నాయకత్వం పిలుపు ఇస్తే పోలీసులకు భయపడకుండా రోడ్ల మీదికి వచ్చి గొంతులు చించుకునేది కార్యకర్తలే. లాఠీ దెబ్బలు తినేది, బుల్లెట్లు తగిలించుకునేది కార్యకర్తలే. నాయకులు అందరూ హౌస్ అరెస్ట్ పేరుతో ఇంట్లో దర్జాగా టీవీ చూస్తూ సేదదీరుతుంటే, అమాయక కార్యకర్తలు మాత్రం రోడ్ల మీద ప్రాణాలకు తెగించి పోరాడుతుంటారు.
కార్యకర్తలను కాపాడుకోవడంలో తెలుగుదేశం పార్టీది అగ్రస్థానం ఉంటుంది. ఆ పార్టీ నుంచి ఎందరో నాయకులు రాజీనామా చేసి ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. అయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ బలం మాత్రం చెక్కుచెదరడం లేదంటే ఆ పార్టీ కార్యకర్తల అంకితభావమే కారణం. మొన్నటి అసెంబ్లీలో ఆ పార్టీకి ఇరవై మూడు సీట్లు మాత్రమే వచ్చి ఉండవచ్చు. కానీ, ఓటింగు శాతం నలభైకి దగ్గరలో ఉందంటే కార్యకర్తలపరంగా తెలుగుదేశం పార్టీ ఎంత పటిష్టంగా ఉన్నదో అర్ధం అవుతుంది. కారణాలు ఏమిటి? కార్యకర్తల క్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎంతదూరమైనా వెళ్తుంది. అధికారంలో ఉన్నప్పుడు వారికి వారి వారి నియోజకవర్గాల్లో వారి స్థాయిని బట్టి ఆర్ధికంగా లాభదాయకమైన పనులు చేసిపెడుతుంది. జన్మభూమి కమిటీల్లో, మరొక కమిటీల్లో అట్టడుగు స్థాయి కార్యకర్తలకు కూడా గుర్తింపు వచ్చేట్లు చేస్తుంది. వారు వివిధ కార్యాల మీద ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తే పనులు వెంటనే చేసిపెట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇస్తుంది. దాంతో వారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్ధికంగా లాభపడి, పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించగలుగుతారు. పార్టీ కార్యకర్తలకు ఇబ్బందుల్లో ఉన్నపుడు ఆర్ధిక సాయం అందిస్తుంది. వారికి ఇన్సూరెన్స్ వసతి కల్పిస్తుంది. అందుకే తెలుగుదేశం కార్యకర్తలు గర్వంగా పార్టీకి అండగా నిలబడతారు.
వైసిపి కోసం గత పదేళ్లుగా అహర్నిశలు పనిచేసి, తెలుగుదేశం నాయకులతో బూతులు తిట్టించుకుని, కేసులు పెట్టించుకుని కోర్టుల చుట్టూ తిరిగి, పోలీస్ దెబ్బలు తిన్న కార్యకర్తలు లక్షలాదిమంది ఉన్నారు. తమకు ఆర్ధికంగా నష్టాలు ఎదురైనా ఉద్యోగాలు, వ్యాపారాలు మానేసి కేవలం జగన్ ముఖ్యమంత్రి అయితే చాలని వారు ధైర్యంగా పోరాడారు. వారి కోరిక ఫలించి వైసిపి పెద్ద మెజారిటీతో గెలిచింది. కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జగనన్న విజయం కోసం తాము చేసిన కృషికి గుర్తింపు లభిస్తుందని, తమ శ్రమకు తగిన పదవులు లభిస్తాయని, గ్రామస్థాయిలో తమ మాటకు విలువ దక్కుతుందని ఆశించారు. కానీ, వైసిపి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా, తమకు కనీసం తమ ఎమ్మెల్యే దర్శనం కూడా కావడం లేదని, ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తే అధికారులు కాదుకదా గుమాస్తాలు కూడా తమను పట్టించుకోవడం లేదని, ఎక్కడా తమ మాట చెల్లుబాటు కావడం లేదని వాపోతున్నారు. గత పదహారు నెలల్లో ఒక్క రాష్ట్రస్థాయి నాయకుడు కూడా అభిమానులతో, కార్యకర్తలతో సమావేశం పెట్టలేదని, తమ బాధలు వినే నాధుడే లేడని బాధను వ్యక్తం చేస్తున్నారు. కేవలం డబ్బు వెదజల్లి పదవులు సంపాదించుకున్న నాయకులు ఈరోజు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, మదించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ విజయం కోసం తాము చేసిన కృషి, శ్రమ అంతా వృధా అయ్యాయని బావురుమంటున్నారు. ఇన్నాళ్లూ జగన్ కోసం కాలాన్ని వృధా చేశామని ఇకనైనా బుద్ధి తెచ్చుకుని బతుకుతెరువు కోసం పార్టీకి దూరంగా ఉండి కూలో నాలో చేసుకుని పెళ్ళాం పిల్లలను పోషించుకుంటామని చెంపలు వాయించుకుంటున్నారు. తమ బాధ జగన్ కు చేరకుండా మధ్యలో నాయకులు అడ్డుపుల్లలు వేస్తున్నారని, జగన్ కూడా తమ అవసరం లేదనే పద్ధతిలో వ్యవహరిస్తుండటం తమను ఆవేదనకు గురి చేస్తున్నదని విలపిస్తున్నారు. “ఏరు దాటిన తరువాత బోడి మల్లయ్య” సామెతను గుర్తుచేశారని, పదేళ్లనుంచి పార్టీకోసం పనిచేస్తున్నప్పటికీ ఎవరైనా ఎమ్మెల్యేను కలవాలన్నా మూడు నాలుగు గంటలపాటు వేచి ఉండాల్సివస్తున్నదని, వారి పీఏలు తమ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా చాలా హీనంగా చూస్తున్నారని, ఇలా అయితే పార్టీనుంచి వెళ్లిపోవడం గౌరవంగా ఉంటుందని సుమారు కోటి రూపాయలవరకు పార్టీకోసం ఖర్చు చేసిన ఒక సీనియర్ నాయకుడు బాధపడ్డారు.
ఇలా అయితే వైసిపికి రాబోయే ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు. మరి నాయకత్వం ఇప్పటికైనా కళ్ళు తీరుస్తుందా? కార్యకర్తలను కాపాడుకుంటుందా? చూడాలి.