తెలంగాణలో వైసీపీ ఓటు ఎటువైపు.? బీఆర్ఎస్‌కే గుద్దుతారా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదు. కానీ, ఆ పార్టీకి అభిమానులున్నారు. తెలంగాణపై వైఎస్ జగన్ ఫోకస్ పెట్టాలేగానీ, చెప్పుకోదగ్గ స్థాయిలో తెలంగాణ రాజకీయాల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేయగలదు. ఈ విషయం వైఎస్ జగన్‌కీ తెలుసు. కానీ, పూర్తిగా ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టడం వల్లే, తెలంగాణ రాజకీయాల్ని ఆయన పట్టించుకోవడంలేదు.

ఆ గ్యాప్‌ని తాను ‘ఫిల్’ చేయగలననుకుని, వైఎస్ షర్మిల అన్నతో విభేదించి మరీ, తెలంగాణలో కొత్త రాజకీయ కుంపటిని పెట్టారుగానీ, ఈ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. సుదీర్ఘంగా ఆమె తెలంగాణలో పాదయాత్ర చేశారు. అధికార బీఆర్ఎస్ మీద నానా రకాల విమర్శలూ చేశారు. ఉద్యమాలూ చేసి, అరెస్టయ్యారు కూడా. ఇంతా చేసి, చివరి నిమిషంలో షర్మిల చేతులెత్తేయడమే కాక, కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారామె.

ఈ క్రమంలో వైసీపీ క్యాడర్, తెలంగాణలో స్తబ్దుగా మారిపోయింది. వైఎస్ జగన్ అభిమాని అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఖమ్మంలో మద్దతిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. అక్కడ కొన్ని చోట్ల వైసీపీ జెండాలు అడపా దడపా కనిపిస్తున్నాయి.

ఇంకోపక్క, తెలంగాణలో పలు నియోజకవర్గాల్లో జగన్ స్టిక్కర్లతో బీఆర్ఎస్ నేతల వెంట కనిపిస్తున్నారు వైసీపీ అభిమానులు. అయితే, పెద్దగా వైసీపీ జెండా తెలంగాణలో ఎక్కడా లేకుండా వైసీపీ అభిమానులు జాగ్రత్త పడుతుండడం గమనార్హం. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఏపీలో అప్పటి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) సాయం చేసిన మాట వాస్తవం. సాయానికి ప్రతి సాయం.. అన్నట్లు తెలంగాణలో గులాబీ పార్టికి మద్దతుగా నిలుస్తున్నారు వైసీపీ క్యాడర్.

కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతిస్తోందిగనుక, అటు వైపు వైసీపీ క్యాడర్ చూడదు. సహజంగానే వైసీపీ క్యాడర్‌కి కాంగ్రెస్ అంటే మంట. అది వేరే చర్చ. ఇక, బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్నాయ్ గనుక, ఆ కూటమి వైపు కూడా వైసీపీ క్యాడర్ చూసే అవకాశం లేదు.