రాజకీయాల్లో పార్టీలకు వ్యూహాలుంటాయి.. ఆ వ్యూహాలు జనాన్ని ఎట్రాక్ట్ చేయడానికే.! మొన్న దుబ్బాక ఉప ఎన్నిక, నిన్న గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు.. వరుస షాక్‌లతో గులాబీ పార్టీ కొంత ఆందోళన చెందింది. దాంతో, తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయక తప్పలేదు గులాబీ పార్టీకి. సరైన సమయంలో, ‘భారత్ బంద్’ టీఆర్‌ఎస్‌కి కలిసొచ్చింది. కేంద్రం చేసిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళనలు చేస్తోన్న దరిమిలా, వారికి బాసటగా భారత్ బంద్‌లో టీఆర్‌ఎస్ కూడా పాల్గొంది. టీఆర్‌ఎస్ నేతలు, ఈ ఆందోళనల్లో పాల్గొంటే.. అది వేరే చర్చ. కానీ, మంత్రులు రోడ్డెక్కడమేంటి.? ఇదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
గులాబీ భయాలిలా రోడ్డున పడ్డాయ్.!
మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి హరీష్‌రావు.. ఇలా చెప్పుకుంటూ పోతే, పక్కా ప్లానింగ్‌తో చాలామంది మంత్రులు, ‘భారత్ బంద్’లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ప్రభుత్వాలు నడుపుతున్నవారిలా రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే, అది శాంతి భద్రతల సమస్య అవుతుందా.? లేదా.? మామూలుగా అయితే, విపక్షాలు ఆందోళనలు చేస్తే, ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణచివేస్తాయి. మరి, అధికారంలో వున్నవారు.. అందునా మంత్రులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే, పోలీసులు ఏం చేయాలి.? ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళది.
ఇంతకీ, ఫలితం దక్కిందా.?
త్వరలో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్ని జరగనుంది. తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని ‘గులాబీ మయం’ చేసెయ్యాలన్న ఆలోచనతో, ‘భారత్ బంద్’ని వినియోగించుకుంది టీఆర్‌ఎస్. అయితే, ఆశించిన స్థాయిలో టీఆర్‌ఎస్‌కి మైలేజ్ పెరగలేదు సరికదా, ‘మన ప్రభుత్వం.. మనమే ఆందోళన చేయడం..’ అంటూ గులాబీ శ్రేణులే ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. రైతులకు బాసటగా నిలవడంలో తప్పు లేదు.. కానీ, మంత్రులు ఆందోళనల్లో పాల్గొనడమే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
అప్పుడు మద్దతిచ్చి, ఇప్పుడు ప్రశ్నిస్తారా.?
చాలా విషయాల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌కి మద్దతిచ్చింది టీఆర్‌ఎస్. కరోనా సమయంలో అయితే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రీ చేయనంతగా మోడీ భజన చేసేశారు కేసీఆర్. ‘మన ప్రధానికి మనం గౌరవం ఇవ్వాలి కదా.?’ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లోనే చాలామందికి చాలా అనుమానాల్ని కలిగించాయి. అదే కేసీఆర్, ఆ తర్వాత మోడీతో పంచాయితీ పెట్టుకోడానికి సిద్ధమయ్యారు.. ఇప్పుడు అదే పంచాయితీ నడుస్తోంది కూడా.! ఏదిఏమైనా.. తెలంగాణలో గెలాబీ రంగు వెలిసిపోతున్నట్లే కనిపిస్తోంది. మరి, దీనికి ‘మందు’ టీఆర్‌ఎస్ దగ్గర వుందా.? అన్నది వేచి చూడాల్సిందే.