వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు మాత్రమే ఎందుకు.?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు దేశంలో పరుగులు పెడుతున్నాయి. పదికి పైగా వందే భారత్ రైళ్ళు ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటికి ప్రజాదరణ ఎంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. పూర్తిగా ఏసీ కోచ్‌లతో, అత్యంత వేగంగా పట్టాలపై ఈ రైళ్ళు పరుగులు తీస్తున్నాయి. శతాబ్ది, దురంతో తదితర రైళ్ళు కూడా అత్యంత వేగంగానే వెళుతున్నాయ్ కదా.! సూపర్ ఫాస్ట్ రైళ్ళ వేగమూ తక్కువేమీ కాదు.

సెమీ హై స్పీడ్ రైళ్ళుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ గురించి చెప్పుకోవచ్చు. అయితే, మన దేశంలో పట్టాల సామర్థ్యం నేపథ్యంలో పరిమిత వేగంతోనే ఈ రైళ్ళను నడుపుతున్నారు. ఎక్కడ కొత్తగా ఈ వందే భారత్ రైలుని ప్రవేశ పెట్టాలన్నా, అక్కడ ప్రధాని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వాలిపోతున్నారు. నిజానికి, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు సామాన్యుల కోసం ఉద్దేశించినవి కావు. దాదాపు విమాన ఛార్జీల తరహాలో వుంటున్నాయన్న విమర్శలు లేకపోలేదు.

రైళ్ళలో అయితే, ఫస్ట్ క్లాస్ ప్రయాణంతో దాదాపు సమానం, అంతకన్నా ఎక్కువని కూడా అంటున్నారు కొన్ని చోట్ల. ముందు ముందు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ సంఖ్య మరింత పెరగనుంది. మరి, ప్రస్తుతం వున్న సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ళను ఏం చేస్తారు.? ఇంకేం చేస్తారు, పీకి పారేస్తారన్నది ఓ వాదన. ఏమో, ఆ ముచ్చట కూడా చూడబోతున్నామేమో. అయినా, ప్రతి రైలునీ ప్రధాన మంత్రే వచ్చి ప్రారంభించడమెందుకు.?

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్న. అంతెందుకు, ప్రతి స్టేషన్‌లోనూ మీరే వుండి జెండా ఊపుకోవచ్చు కదా.? అంటూ ప్రధాని మీదనే తలసాని సెటైర్లేశారాయె.!