సమర శంఖం పూరిస్తానని సైడెపోయారేంటి బాబుగారు !

chandra babu naidu
ఎన్నాడూ లేని విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాలక వర్గానికి 48 గంటలు డెడ్ లైన్ పెట్టిన సంగతి తెలిసిందే.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు తెలిపి ఇప్పుడు అధికారంలోకి వచ్చి మూడు రాజధానులంటూ అన్యాయం చేస్తారా.. దమ్ముంటే వైఎస్ జగన్ అసెంబ్లీని రద్దు చేసి మూడు రాజధానుల నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లాలని, తాము కూడా రాజీనామాలు చేసి ఎన్నికలకు వస్తామని, తమ నిర్ణయం ఏమిటో ప్రభుత్వం 48 గంటల్లోగా చెప్పాలని సవాల్ విసిరారు.  ఈ సవాల్ విన్న చాలామంది ఇదేదో తేడాగా ఉందే అనుకోగా టీడీపీ కార్యకర్తలు మాత్రం ఆహా.. బాబుగారు అమరావతి పోరాటాన్ని ఉధృతం చేయబోతున్నారని, 48 గంటల తర్వాత పరినణామాలు అల్లకల్లోలంగా ఉంటాయని, ఇక బాబుగారు చెడుగుడు ఆడేసుకుంటారని ఏవేవో ఊహించుకున్నారు.  
 
 
కానీ అలాంటిదేదీ జరగలేదు.  అధికార పక్షం బాబుగారి సవాలుకు బెదరకపోగా అమరావతి పట్ల విశ్వాసం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నది మీరు కాబట్టి మీరే రాజీనామాలు చేస్కోండి, మేము మాత్రం మూడు రాజధానుల మాట మీదే ఉన్నాం అంటూ ప్రకటించేశారు.  దీంతో అసలు అమరావతి పట్ల టీడీపీ నేతల చిత్తశుద్ధి ఎంతనే చర్చ మొదలైంది.  సవాల్ విసిరింది ఆయనే కాబట్టి రాజీనామాల పర్వం కూడా వారి నుండే మొదలవ్వాలనే వాదన తెరపైకి వచ్చింది.  కానీ ఆ సాహసం జరగలేదు.  48 గంటలు పూర్తైన సందర్బంగా బాబుగారు మీడీయా ముందుకు వచ్చి ఎప్పటిలాగే తనదైన స్టైల్లో వీడియోలు ప్లే చేసి విమర్శలు చేసి వెళ్లిపోయారు.  వెన్నెముక లేని నాయకులు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ జనాన్ని మోసం చేస్తున్నారని, రాష్ట్ర విభజన కంటే ఈరోజు పెద్ద అన్యాయమే జరిగిందని, జనమంతా ఈ విషయాన్ని గ్రహించాలని, అధికార పక్షం తోక ముడిచిందని అన్నారే తప్ప ఎక్కడా రాజీనామాల ఊసే ఎత్తలేదు. 
 
 
పైపెచ్చు జగన్ అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా ఉంచుతామని మాటిస్తే తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవులను వదులుకుంటామని బంపర్ ఆఫర్ ఇచ్చారు.  అయినా తాము విసిరిన సవాల్ మీద తమ తదుపరి కార్యాచరణ ఏమిటో చెప్పకుండా దాన్ని అమరావతిని రాజధానిగా ఉంచితే దానికి బదులు పదవులు వదిలేసుకుంటాం అంటూ కుండమార్పిడి ఆఫర్ ఇవ్వడం ఆశ్చర్యంగానే ఉంది.  ఇన్ని మాటలు మాట్లాడుతున్న బాబుగారికి ప్రత్యర్థి పార్టీ తమ మాట ససేమిరా వినదనే అవగాహన లేదా అంటే ఉండకేం బాగానే ఉంది.  అందుకే కార్యరూపం దాల్చని సవాళ్లు, అంగీకారం రాని ఆఫర్లు ఇస్తున్నారు.  నిజంగానే అమరావతి ఉద్యమాన్ని నడపదల్చుకుంటే బాబుగారి వైఖరి ఇలా ఉండేది కాదు.  తాడో పేడో అనే తరహాలో ఉండేది.
 
 
రాజీనామా సవాల్ విసిరినప్పుడు అవతలివారు డా దాన్ని స్వీకరిచకుండా మీ కమిట్మెంట్ ఏమిటో నిరూపించుకోండి అన్నప్పుడు ముందుగా తామే పదవులకు రాజీనామాలు చేయాలి. టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే ఉపఎన్నికలు జరగాల్సిందే కదా.  అప్పుడు ఏ దారీ లేక వైసీపీ కూడా బరిలోకి దిగుతుంది.  అప్పుడిక టీడీపీ అమరావతి నినాదంతో, వైసీపీ మూడు రాజధానుల నినాదంతో ఎన్నికల్లో నిలబడతాయి.  ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు తమకు అమరావతి కావాల్సి వస్తే టీడీపీని లేదు మూడు రాజధానులు ఓకే అనుకుంటే వైసీపీని గెలిపిస్తారు.  ఆ ఫలితంతో  ప్రజాభిప్రాయం ఎలా ఉందో ఒక అవగాహన వచ్చేది.  కానీ టీడీపీ టీమ్ ఆ సాహసం చేయలేకపోయింది.  బాబుగారు సమర శంఖం పూరిస్తారని అనుకుంటే సైడైపోయారు. 
 
 
ఉద్యమం అంటే వ్యూహాలు, ప్రతివ్యూహలే కాదు.. అప్పుడప్పుడు సాహసాలు కూడా జరగాలి.  అప్పుడే ఉద్యమాన్ని మోస్తున్నామనే వారి కమిట్మెంట్, దూకుడు, ఎమోషన్ బయటపడతాయి.  జనం కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.  తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ చేసింది అదే.  సిద్దిపేట నుండి ఆయన రాజీనామా చేశారు.  బోలెడంత పదవీకాలం ఉన్నా కూడా తెరాస ఎమ్మెల్సీలు పదవులను త్యాగం చేశారు.  అప్పుడే ఉద్యమం రక్తి కట్టింది.  ఆ తరహా దూకుడు టీడీపీలో కానీ చంద్రబాబులో కానీ లేదు.  అందుకే రాజీనామాలకు సాహసించలేకపోయారు.  కనీసం అందరు ఎమ్మెల్యేలతో కాకపోయినా ఆయన ఒక్కరే రాజీనామా చేసినా బాగుండేది.  ఎందుకంటే కుప్పంలో ఆయన ఓడిపోవడం దాదాపు అసాధ్యం.  తప్పకుండా గెలుస్తారు.  అప్పుడు సవాల్ విసిరారు కాబట్టి రాజీనామా చేశారనే ఘనతైనా దక్కి ఉండేది.