విపక్షాలన్నాక విమర్శలు చేస్తాయి. విమర్శలు చేయకపోతే విపక్షాలకు ఉనికి వుండదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా విపక్షంలో వున్నప్పుడు చీటికీ మాటికీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చింది. ప్రత్యేక హోదా సహా చాలా అంశాలపై రాజకీయ పోరాటం చేసింది వైసీపీ. ఇప్పుడు అదే పని తెలుగుదేశం పార్టీ చేస్తోంది. అయితే, గతంలో అధికారంలో వున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ తప్పిదాలైతే చేస్తోందో, ఇప్పుడు వైసీపీ కూడా అవే తప్పిదాల్ని చేస్తుండడంద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అది నెగెటివ్ ఇంపాక్ట్‌ని చూపిస్తోంది.
సంక్షేమ పథకాలకు ప్రచారకర్తలేరీ.!
ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రానికి సంక్షేమ పథకాలు పెను భారమే. అయినాగానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం.. స్తోమతుకి మించి సంక్షేమ పథకాల కోసం నిధుల్ని వెచ్చిస్తోంది. అలాంటప్పుడు, ఆయా సంక్షేమ పథకాలకు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ‘స్టార్ క్యాంపెయినర్స్’గా వుండాలి కదా.? కానీ, ఆ జాడే కనిపించడంలేదు. ఫొటోలకు పోజులివ్వడం తప్ప, జగన్ ఆలోచనల్ని జనంలోకి బలంగా తీసుకెళ్ళలేకపోతున్నారు. పత్రికల్లో ప్రకటనలు ఇస్తే సరిపోదు.. జాతీయ స్థాయిలో రాష్ట్రం ఇమేజ్‌ని పెంచడానికంటూ నిధులు వెచ్చించినా సరైన ఫలితాలు రావు.
ప్రత్యర్థులపై విమర్శలు తప్పవుగానీ..
రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయని రాజకీయ పార్టీని ఈ రోజుల్లో ఆశించగలమా.? వైసీపీ కూడా, తెలుగుదేశం పార్టీపైనో, ఇతర రాజకీయ పార్టీలపైనో విమర్శలు చేయడాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పు పట్టలేం. కానీ, అదే సమయంలో.. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన విషయాలపై ‘డిటెయిల్డ్’గా మాట్లాడాలి కదా.? ప్రజలకు సరైన సమాచారం ఇవ్వాలి కదా.! ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని వంటి విషయాల్లో భరోసా ఇవ్వకపోతే, ముందు ముందు ప్రజల్లోకి వెళ్ళడం కష్టమైపోదూ!
పథకాలకు ఓట్లు రాలవ్.!
సంక్షేమ పథకాల పట్ల ప్రజల ఆలోచనా ధోరణి మారింది. ‘మా నుంచి గుంజుకుంటున్న డబ్బులతోనే కదా సంక్షేమ పథకాల అమలు..’ అన్న భావన జనంలో పెరిగింది. అందుకేనేమో, చంద్రబాబు గొప్పగా సంక్షేమ పథకాలు అమలు చేసినా, టీడీపీ ప్రభుత్వాన్ని ‘చాచి పెట్టి కొట్టారు’ 2019 ఎన్నికల్లో. భవిష్యత్తులో ఆ పరిస్థితిని వైసీపీ కొనితెచ్చుకోకూడదంటే, ఒకింత అప్రమత్తంగా వుండాలి. రాష్ట్రానికి సంబంధించి కీలకమైన అంవాల్లో కేంద్రాన్ని ప్రశ్నించాలి. కానీ, అధికార పార్టీలో చాలామంది నేతలు, సొంత పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం కన్నా, విపక్షాలపై విరుచుకుపడ్డంలోనే శ్రద్ధ పెడుతున్నారు.. అదే సమయంలో బీజేపీని పల్లెత్తు మాట అనేందుకూ సాహసించడంలేదు.ఇలా, నాటకీయంగా మారిపోతున్న అధికార పార్టీ రాజకీయాలు.. వైఎస్ జగన్ ఇమేజ్‌కి తూట్లు పొడుస్తున్నాయనే చర్చ గ్రౌండ్ లెవల్‌లో వైసీపీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. ఏడాది పాలన తర్వాత ‘రివ్యూ’ చేసుకోవాలి, లోపాల్ని సరిదిద్దుకోవాలి.. లేదంటే, చంద్రబాబు పరిస్థితి ఏమైందో కళ్ళముందు కనిపిస్తోంది కదా.!