తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గనుక, తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అమరావతి విషయంలో ‘రెఫరెండం’ తీసుకుని వుంటే, ఇప్పుడాయన 3 క్యాపిటల్స్ విషయమై వైఎస్ జగన్ సర్కార్‌ని ‘రెఫరెండం’ కోసం డిమాండ్ చేసే నైతిక హక్కుని కలిగి వుంటారు. అయినా, ప్రజాస్వామ్యంలో ‘రెఫరెండం’ అనే ప్రస్తావనకు ఎంతవరకు ఇప్పుడున్న రోజుల్లో చోటు వుంది.? అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం కొత్త కాదు. ఏ పార్టీ అధికారంలో వున్నా చేసేది అదే. ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రిగా వున్నప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడారు.? ముఖ్యమంత్రి పదవిలో లేనప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు.? అన్నది కాస్త ఆలోచిస్తే.. రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఏంటన్నది అర్థమయిపోతుంది.
రెఫరెండం.. ప్రజల కోసమా.? అధికారం కోసమా.?
వున్నపళంగా వైఎస్ జగన్ ప్రభుత్వం కూలిపోతే, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలన్నది చంద్రబాబు ఆలోచన. ‘అదిగో జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయ్..’ అంటూ చంద్రబాబు తెగ సంబరపడిపోతున్నారు. ఇంతలోనే, 3 క్యాపిటల్స్ కోసం రెఫరెండం అంటున్నారు. అంటే, చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు.? అసలు ఆయన మనసులో ఏముంది.? అమరావతి విషయంలో కొన్ని గ్రామాల్లోనే ఆందోళన జరుగుతున్న మాట వాస్తవం. రాష్ట్రమంతటికీ ఈ ఆందోళన వ్యాపించడంలేదంటే, వాస్తవ పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోలేని అమాకుడైతే కాదు చంద్రబాబు. ఈ విషయంలో అందరికీ ఓ క్లారిటీ వుంది.
అమరావతి రైతుల ఆందోళన అర్థం చేసుకోదగ్గదేగానీ.!
రాజధాని అమరావతి విషయంలో రైతులు తమకు ఏం కావాలి.? అన్నదానిపై స్పష్టతనివ్వలేకపోతున్నారు. ‘మా భూముల ధరలు పడిపోతున్నాయ్..’ అన్న ఆవేదన చాలామందిలో కన్పిస్తోంది. ‘గత ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించడంలేదు’ అని రైతులు అంటున్నారు. రైతుల ఆవేదనలో కొంత వాస్తవం వుంది. కానీ, చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ గొప్పదంటే ఎలా.? ఇక్కడే వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ‘చంద్రబాబు తప్పే చేశారనుకుందాం.. మీరు ఇంకా గొప్పగా చేసెయ్యండి..’ అని రైతులు అనడం సబబుగానే వున్నా, రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు పెట్టిన ‘మెలికలు’ అన్నీ ఇన్నీ కావు. వాటిని విప్పాలంటే అంత ఆషామాషీ వ్యవహారమూ కాదు.
చంద్రబాబు అలా ఫిక్సయిపోయినట్టున్నారు..
2019 ఎన్నికల్లో 23 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీకి. ప్రపంచ స్థాయి రాజధాని.. అంటూ ఏ అమరావతి గురించి చెప్పారో, ఆ అమరావతి పరిధిలోని మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు. ఇది తెలిసీ, చంద్రబాబు రెఫరెండం అడుగుతున్నారంటే, ఆయన ఉద్దేశ్యమేంటి.? ‘నేను గెలిచినా, గెలవకపోయినా.. వైఎస్ జగన్ పడిపోతే చాలు’ అన్న పైశాచికానందమే ఆయనలో కనిపిస్తోంది తప్ప అమరావతి విషయంలోగానీ, ఆంధ్రప్రదేశ్ విషయంలోగానీ, ఆయనలో చిత్తశుద్ధి వుందని అనుకోలేం.