ఆరోగ్యానికి వ్యాయామం అవసరం అని అందరికీ తెలుసు. కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు.. కొందరు వ్యాయామం అనగానే కష్టమైన వర్కౌట్స్ అనుకుంటారు. అయితే ఇది పూర్తిగా తప్పు.. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండే, సులభమైన, ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం నడక. రోజూ కేవలం అరగంట నడక వల్ల శరీరానికి లభించే ప్రయోజనాలు తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా, క్యాన్సర్ అనే ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షణ కలిగించగల శక్తి కూడా నడకలో ఉందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, WHO వంటి సంస్థలు సైతం వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు నడక లేదా 75 నిమిషాల వేగమైన వ్యాయామం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్, యుటరస్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని నిర్ధారించాయి. నడక వల్ల బరువు నియంత్రణలో ఉండి, ముఖ్యంగా పొట్ట మీద కొవ్వు తగ్గుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతను సరిచేసి, క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధిస్తుంది. అంతేకాకుండా, నడక రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలోని Natural Killer Cellsను యాక్టివ్ చేస్తుంది. ఇవి క్యాన్సర్ కణాలను గుర్తించి వాటిని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అలాగే, నడక యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తిని ప్రోత్సహించి, ఫ్రీ రాడికల్స్ వల్ల కణాల్లో జరిగే డీఎన్‌ఏ నష్టాన్ని నివారిస్తుంది. క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారికి కూడా నడక ఉపశమనాన్ని ఇస్తుంది అలసట తగ్గి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కీమోథెరపీ, రేడియేషన్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు కూడా తగ్గవచ్చు. రోజూ కనీసం 30 నిమిషాలు నడక.. కేవలం ఈ చిన్న అలవాటు మాత్రమే మీ జీవితంలో భారీ మార్పు తీసుకురాగలదు. ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తూ, ప్రాణాంతక వ్యాధులను దూరం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. (గమనిక : ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని మేము ధృవీకరించడం లేదు.)
