భారతదేశంలో ప్రస్తుతం చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా కనిపించే ఒక ప్రమాదకరమైన లోపం.. విటమిన్ బి12 కొరత. ఇది చిన్నపాటి సమస్యలా కనిపించినా, శరీరంలోని రక్తం నుంచి నాడీ వ్యవస్థ వరకు దెబ్బతీసే స్థాయిలో ప్రభావం చూపుతుంది. తాజాగా వెలువడిన పలు అధ్యయనాల ప్రకారం, దేశంలో ప్రతి రెండవ వ్యక్తి ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
విటమిన్ బి12 ప్రధానంగా మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, జున్ను వంటి ఆహారాలలో ఉంటుంది. అయితే భారతదేశంలో ఎక్కువ మంది శాఖాహారులు కావడం వల్ల ఈ విటమిన్ సరిపడా లభించడం లేదు. దీని ఫలితంగా బలహీనత, అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపం, తిమ్మిరి వంటి సమస్యలు సాధారణమయ్యాయి. నిపుణుల ప్రకారం, విటమిన్ బి12 మన శరీరంలో ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ కణాలు శరీరంలోని ప్రతి అవయవానికి ఆక్సిజన్‌ను రవాణా చేస్తాయి. ఈ విటమిన్ లోపిస్తే రక్తహీనత, శ్వాసలోపం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.
అలానే, దీర్ఘకాలంగా ఈ లోపం కొనసాగితే నాడీ వ్యవస్థ పనితీరుపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. చేతులు, కాళ్లలో తిమ్మిరి, జలదరింపు, కండరాల బలహీనత, స్మృతి లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైద్యులు చెబుతున్నట్లుగా, విటమిన్ బి12 మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకం. గర్భిణీ స్త్రీలలో దీని లోపం ఉంటే పుట్టబోయే శిశువులో మెదడు అభివృద్ధి సమస్యలు తలెత్తవచ్చు. పిల్లలలో కూడా చదువుపై, గుర్తుంచుకునే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
విటమిన్ బి12 కేవలం రక్తానికి మాత్రమే కాదు, గుండె ఆరోగ్యానికి కూడా ముఖ్యమైనది. శరీరంలో ఈ విటమిన్ స్థాయిలు తగ్గినప్పుడు, హోమోసిస్టీన్ అనే అమైనో ఆమ్లం విచ్ఛిన్నం కాకపోవడం వల్ల రక్తం చిక్కగా మారుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాదు, అధిక రక్తపోటు, హార్మోన్ల అసమతుల్యతకు కూడా ఇది కారణమవుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. వైద్య నిపుణులు చెబుతున్నట్లుగా, ఈ లోపానికి ప్రధాన కారణం ఆహార అలవాట్లే. ప్రాసెస్ చేసిన ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, పాలు లేదా పాలు ఉత్పత్తులు తక్కువగా తినడం, ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యలు కూడా బి12 శోషణను తగ్గిస్తాయి. దీని ఫలితంగా క్రమంగా శరీరంలో ఈ విటమిన్ స్థాయిలు పడిపోతాయి.
మీరు తరచూ అలసటగా, బలహీనంగా, ఏకాగ్రత కోల్పోయినట్లు అనిపిస్తే, అది చిన్న సమస్య కాదు. అది విటమిన్ బి12 లోపం సంకేతం కావచ్చు. అలాంటి సందర్భంలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మీ ఆహారంలో పాలు, పెరుగు, జున్ను, గుడ్లు, చేపలు, బలపరచిన ధాన్యాలు వంటి పదార్థాలను చేర్చుకోవాలి. శాఖాహారులు అవసరమైతే సప్లిమెంట్లు లేదా ఇంజెక్షన్లు తీసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. భారతదేశం లాంటి దేశంలో విటమిన్ బి12 లోపం పెద్ద సమస్యగా మారడం ఆందోళన కలిగిస్తోంది. తగిన అవగాహనతో, సరికొత్త ఆహార అలవాట్లు అలవర్చుకుంటే ఈ లోపాన్ని సులభంగా ఎదుర్కోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే, మన శరీరానికి బలాన్ని ఇచ్చేది ప్రోటీన్ మాత్రమే కాదు.. సరైన విటమిన్‌లు కూడా. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
