అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్టు తయారైంది విశాఖపట్నం పరిస్థితి. టూరిజం సహా అనేక అనుకూలతలు విశాఖపట్నంకి వున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా హైదరాబాద్ తర్వాత అంతటి ప్రత్యేకతలున్న ఏకైక నగరం విశాఖపట్నం మాత్రమే. విభజన తర్వాత, విశాఖపట్నం 13 జిల్లాల ఆంధ్రపదేశ్ రాజధాని అవుతుందని చాలామంది అనుకున్నారు. అయితే, ‘పచ్చ లాబీయింగ్’ కారణంగా విశాఖకు దక్కాల్సిన అదృష్టం, అమరావతికి వెళ్ళిపోయింది. చంద్రబాబు హయాంలో ఎదుగూ బొదుగూ లేకుండా పోయిన విశాఖపై, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆశలు పెరిగాయి. మూడు రాజధానులంటూ విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదాని వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చేందుకు సంకల్పించిన విషయం విదితమే. కోర్టులో కేసుల కారణంగా ఆ వ్యవహారం ప్రస్తుతానికి ఆగింది. అయితే, జస్ట్ ఇంకో నాలుగు నెలల్లోనే విశాఖకు అధికారికంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా దక్కబోతోందని వైసీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలతో విశాఖలో పండగ వాతావరణం నెలకొంది. విశాఖ అంటే, ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కు.
ఆ మాటకొస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికే పెద్ద దిక్కు. ముందే చెప్పుకున్నాం కదా.. అన్నీ వున్నా, అల్లుడి నోట్లో శని చందం అని.. ఇకపై, ఆ శని వదిలిపోతుందన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తే తప్ప, రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం లేదు. నిజానికి, 2014లో ఉమ్మడి ఆంధ్రపదేశ్ విడిపోయినప్పటినుంచీ అదే పరిస్థితి. ఒక నగరం, రాష్ట్రానికి రాజధాని అయితే, ఆ లెక్క వేరు. కానీ, రాజధాని నగరాన్ని పూర్తిగా నిర్మించాలనుకుంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఫస్ట్ టైమ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వచ్చిన ఈ ఆలోచన, సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబుకి లేకపోవడం శోచనీయమే. అయితే, అమరావతి సమస్యల్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ఎలా అడ్రస్ చేస్తుందన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆ సమస్య పరిష్కారమైతే, రాష్ట్రానికి రాజధాని సమస్య తీరుతుంది.