తెలంగాణలో టీఆర్‌ఎస్‌కి ఎదురే లేదు.. అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, టీఆర్‌ఎస్‌ని తెలంగాణలో గట్టిగానే సవాల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ పొలిటీషియన్స్ ఇతర పార్టీల్లోంచి బీజేపీ వైపుకు దూసుకొస్తున్నారు. రాజకీయంగా ఒకప్పుడు కేసీఆర్ కంటే స్ట్రాంగ్‌గా వున్న లీడర్స్ కొందరు, బీజేపీలో చేరుతుండడంతో తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా బలపడుతోంది. ఇటీవల సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి కూడా బీజేపీలో చేరారు. ఆమె, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మీద పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈ విషయమై విజయశాంతిని ప్రశ్నిస్తే, ‘ఆ ఆలోచన ప్రస్తుతానికైతే లేదు. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నాకు తెలియదు..’ అని సెలవిచ్చారామె. గతంలో కూడా ఇలాంటి ప్రశ్నలు విజయశాంతి ముందుకొచ్చాయి. అయితే, అప్పట్లో ఆమె ‘నేను రెడీ’ అనేశారు. ఇప్పుడెందుకోగానీ, ‘పార్టీ నిర్ణయాన్ని బట్టి..’ అంటూ కాస్త డిప్లమాటిక్‌గా సమాధానమిచ్చారు విజయశాంతి. ఒకప్పుడు విజయశాంతికి రాజకీయంగా వున్న ఫాలోయింగ్ వేరు. ఇప్పుడు ఆమె పరిస్థితి వేరు. రాజకీయాల్లో నిలకడలేని వ్యక్తి.. అనే ఇమేజ్ విజయశాంతికి వచ్చేసింది. దానిక్కారణం ఆమె బీజేపీ నుంచి తల్లి తెలంగాణ పార్టీ.. అట్నుంచి టీఆర్‌ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ.. ఇలా పలు పార్టీలు మారడమే.
అయితే, కేసీఆర్ కూడా ఇలానే పార్టీలు మారారు, మార్చారు.. అన్నది విజయశాంతి వెర్షన్. టీడీపీ నుంచి బయటకు వచ్చి, టీఆర్‌ఎస్ స్థాపించిన కేసీఆర్.. చంద్రబాబుతోనూ కలిశారు, కాంగ్రెస్‌తోనూ కలిశారు, బీజేపీతోనూ కలిసేందుకు ప్రయత్నించారన్నది విజయశాంతి వాదన. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. అయితే, కేసీఆర్‌ని సవాల్ చేసేంత స్ట్రాంగ్ పొజిషన్‌లో అయితే ప్రస్తుతానికి విజయశాంతి లేరు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. కేసీఆర్‌కి బాగా పట్టున్న ప్రాంతాల్లో బలమైన నేతల వేటలో పడింది బీజేపీ. ఆ లిస్ట్‌లో విజయశాంతి పేరు అస్సలు లేదట. ఆమెను జస్ట్ ఓ ‘గ్లామరనున్న’ పొలిటికల్ స్టార్‌లా మాత్రమే బీజేపీ చూస్తోందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం.