అమెరికాలో గడువు ముగిసిన వీసాలతో ఉన్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది. వీసా మించిన సమయంలో అక్కడే కొనసాగితే కఠిన చర్యలు ఎదురవుతాయని స్పష్టం చేసింది. చట్టాలను ఉల్లంఘించిన వారు భవిష్యత్తులో అమెరికా గడపను తాకే అవకాశాలు కోల్పోతారని పేర్కొంది.
పర్యాటక, విద్యార్థి, ఉద్యోగ వీసాలు కలిగిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని స్పష్టం చేస్తూ, వీసా గడువు ముగిసిన తర్వాత దేశం విడిచిపెట్టకపోతే తక్షణమే పంపిచివేయడం జరుగుతుందని పేర్కొంది. ఇది కేవలం అమెరికాలోని విద్య, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపించడమే కాదు, శాశ్వత నిషేధానికి దారి తీసే ప్రమాదముందని హెచ్చరించింది. ఇప్పటికే అమెరికాలో గడువు మించిన వ్యక్తులపై గతంలోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు కేసులు నమోదు కావడం తెలిసిందే.
అనుకోని పరిస్థితుల్లో అమెరికా విడిచి రావడం సాధ్యపడకపోతే, వెంటనే యుఎస్‌సీఐఎస్ (USCIS) అధికారులను సంప్రదించాలని సూచించింది. తమ స్టేటస్‌ను రెగ్యులరైజ్ చేసుకోవడానికే అయినా చట్టబద్ధ మార్గాన్ని అనుసరించాలన్నది హెచ్చరిక సారాంశం. లేదంటే రోజుకు దాదాపు 1,000 డాలర్ల వరకు జరిమానాలు, జైలు శిక్ష, తద్వారా శాశ్వత ప్రవేశ నిషేధం తప్పదన్నది అధికారిక స్పష్టత.
హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం గతంలో వెల్లడించిన ప్రకారం, వీసా గడువు మించాక ఒక్క రోజు కూడా ఎక్కువగా ఉన్నా జరిమానా తప్పదు. 30 రోజులకు మించి ఉన్నవారికి తుది సమయాల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతాయని, తక్షణమే స్వదేశానికి ప్రయాణించాల్సిన అవసరం ఉందని రాయబార కార్యాలయం మరోసారి హెచ్చరిస్తోంది.