ఏకగ్రీవాల రగడ: వైసీపీలో మళ్ళీ అదే తొందరపాటు

YSRCP in dialoma with CBI notices 

అసలు వైసీపీలో ఏం జరుగుతోంది.? ఎందుకిలా తొందరపాటు వ్యాఖ్యలు, ప్రకటనలతో అభాసుపాలవుతున్నట్టు.? పార్టీని కావాలనే ఎవరన్నా వెనక్కి నెట్టేయాలని ప్రయత్నిస్తున్నారా.? ఇలాంటి అంశాలపై అధినేత వైఎస్ జగన్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి వుంది. రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలకు నగారా మోగిన విషయం విదితమే. కోర్టు మొట్టికాయలతో ప్రభుత్వమూ దిగొచ్చింది.. ఉద్యోగ సంఘాల నేతలూ సర్దుకుంటున్నారు. కానీ, ఇంకా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల వైసీపీకి కలిగే అదనపు రాజకీయ ప్రయోజనమేంటో వైసీపీ ముఖ్య నేతలకే తెలియాలి. నిజానికి, స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాలు సర్వసాధారణం. అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల విషయంలో కూడా ఒక్కోసారి ఏకగ్రీవాలవుతుంటాయి.. సిట్టింగ్ ప్రజా ప్రతినిథులు అకాల మరణం చెందితే, ఆయా వ్యక్తుల గౌరవార్ధం ఇతర రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపకపోవడం ద్వారా జరిగే ఏకగ్రీవాలవి.

అవి అరుదుగా జరుగుతుంటాయి. స్థానిక ఎన్నికల పరిస్థతి వేరు. ఎప్పటినుంచో ఈ ఏకగ్రీవాల ట్రెండ్ నడుస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా చెప్పారు. ఎలాంటి వివాదాలకూ తావు లేకుండా జరిగే ఏకగ్రీవాల విషయంలో సమస్య ఏమీ వుండదని తేల్చి చెప్పిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, సాధారణంగా జరిగే ఏకగ్రీవాలకు మించి జరిగినప్పుడు మాత్రం, ఆయా ఏకగ్రీవాలపై ప్రత్యేక పరిశీలన జరుగుతుందని అన్నారు. ఇందులో వివాదానికి ఆస్కారమే లేదు. కానీ, ముందే వైసీపీ ముఖ్య నేతలు తొందరపడ్డారు. ఏకగ్రీవాలను అడ్డుకునేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ, టీడీపీతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించేశారు వైసీపీ నేతలు. ఇదొక్కటే కాదు, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం.. పత్రికలకు ప్రకటన ఇవ్వడం, అదీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన కావడం విమర్శలకు తావిచ్చింది. ఐ అండ్ పీఆర్ కమిషనర్‌ని ఈ విషయమై వివరణ కోరినట్లు ఎస్ఈసీ మీడియాకి వెల్లడించడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా.. అని ఎస్ఈసీ నొక్కి వక్కాణిస్తున్న దరిమిలా, అధికార పార్టీ.. ఇకనైనా ఎస్ఈసీ విషయంలో రాజకీయాల జోలికి పోకుండా వుంటే బెటర్.