ఓ వైపు ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు.. కొత్త వ్యవసాయ చట్టాల్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ, రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. గల్లీల్లో టీఆర్‌ఎస్, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్ని ప్రశ్నించింది. మరి, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దలకి ఈ విషయమై కేసీఆర్ ఏమైనా చెప్పారా.? తన నిరసనని తెలియజేశారా.? అంటే, అలాంటిదేమీ వున్నట్టు లేదు. తెలంగాణకు సంబంధించి పలు కీలక అంశాలపై కేంద్రంతో కేసీఆర్ చర్చించి వచ్చారంతే. కేసీఆర్, ఢిల్లీకి వెళ్ళి వచ్చాక.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని బీజేపీ అదినాయకత్వం పిలిచింది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల తదనంతర రాజకీయ పరిణామాలపై ఆరా తీసింది. ‘కేసీఆర్‌ని ఎవరూ కాపాడలేరు.. ఆయన జైలుకు వెళ్ళడం ఖాయం..’ అంటోందిప్పుడు తెలంగాణ బీజేపీ. మరోపక్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, నేడు ఢిల్లీకి వెళ్ళారు. అసలేం జరుగుతోంది ఢిల్లీలో.!
వైఎస్ జగన్ లెక్కలు వేరే వున్నాయ్..
పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సహా చాలా కీలక అంశాల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళేందుకే వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన.. అన్నది వైఎస్సార్సీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మూడు రాజధానుల విషయం కూడా ఈ టూర్‌లో చర్చకు రాబోతోందట. శాసన మండలి రద్దు వంటి అంశాలూ చర్చకు వస్తాయని అంటున్నారుగానీ, ఓ పక్క కొత్తగా ఎమ్మెల్సీ అవకాశాలంటూ పదవుల్ని పంచేస్తూ, శాసన మండలి రద్దు.. అనే అంశం ఢిల్లీలో ప్రస్తావిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
కేసీఆర్‌పై కౌంటర్ ఎటాక్ తప్పదా.?
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణ విషయాన్ని కేసీఆర్, కేంద్రం దృష్టికి వెళితే.. దాన్ని ఆపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర జల శక్తి శాఖ ఆదేశించిన విషయం విదితమే. తెలంగాణలోని పలు ప్రాజెక్టులకూ కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్, ఢిల్లీకి వెళ్ళి పోతిరెడ్డిపాడు అంశాన్ని ప్రస్తావిస్తారా.? అట్నుంచి సానుకూల స్పందనని రాబడతారా.? అన్న ఉత్కంఠ రాయలసీమ వాసుల్లో వ్యక్తమవుతోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు, రాయలసీమ వరప్రదాయనిగా ప్రచారం పొందుతోంది మరి.
ఏపీ బీజేపీ అధ్యక్షుడూ ఢిల్లీకి వెళతారా.?
కేసీఆర్, ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వెంటనే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్ళారు. సో, వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళొస్తే.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావొచ్చు. ఎటూ, తిరుపతి ఉప ఎన్నిక రచ్చ షురూ అవుతున్న నేపథ్యంలో.. ఈ అంశం కూడా ఢిల్లీలో చర్చకు వస్తుందేమో.! దాంతోపాటుగా, మూడు రాజధానులు సహా కీలక అంశాలపై ఇటీవల ఏపీ బీజేపీలో మారిన స్వరం.. బీజేపీ అధిష్టానం కనుసన్నల్లో నడుస్తున్నదే అయితే.. ఆ వ్యవహారం ముందు ముందు మరింత వేడెక్కనుందన్నమాట.