‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే నినాదం కొన్ని దశాబ్దాల తర్వాత ఇంకోసారి మరింత గట్టిగా వినిపిస్తోంది. బీజేపీ తప్ప, ఇతర రాజకీయ పార్టీలన్నీ ఈ నినాదంతో ముందుకు వెళుతున్నాయి. కొందరు బీజేపీ నేతలు కూడా మీడియా చర్చా కార్యక్రమాల్లో ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అనే నినాదానికి కట్టుబడి వున్నామంటున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ, ప్రస్తుతం ఆంధ్రపదేశ్‌లో అతి పెద్ద పరిశ్రమ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వున్న ఈ సంస్థకు ప్రైవేటు తుప్పు పట్టబోతోంది. కేంద్రం, తన వాటాల్ని ప్రైవేటు సంస్థలకు విక్రయించేందుకు సిద్ధమయిన దరిమిలా, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ‘విశాఖ ఉక్కు – ఆంధ్రప్రదేశ్ హక్కు’ అనే నినాదంతో కదం తొక్కుతున్నారు రాజకీయాలకతీతంగా ఆయా పార్టీలకు చెందిన నేతలు. ఇదిలా వుంటే, అధికార వైసీపీకి చెందిన ఓ ముఖ్య నేత తెరవెనుక నడిపిన మంత్రాంగం నేపథ్యంలోనే విశాఖ ఉక్కుకి ప్రైవేటు తుప్పు పట్టేయబోతోందంటూ అధికార తెలుగుదేశం పార్టీ ప్రచారం షురూ చేసింది.
కొన్నాళ్ళ క్రితం సినీ నటుడు, టీడీపీ మద్దతుదారుడైన శివాజీ (గతంలో బీజేపీ మద్దతుదారుడిగానూ పనిచేశారు) విశాఖ ఉక్కు పరిశ్రమ విషయమై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. రాజకీయాల సంగతి పక్కన పెడితే, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత, 13 జిల్లాల ఆంధ్రపదేశ్ ప్రజలందరికీ వుంది. ఇందులో ఇంకో మాటకు ఆస్కారమే లేదు. బలిదానాలతో ఏర్పాటయిన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం కానివ్వబోమని వివిధ రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. అయితే, నష్టాల్లో వున్న పరిశ్రమల్ని ప్రైవేటుకి అప్పగించడం ద్వారా లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే జరుగుతోందనీ, కార్మికులకుగానీ, రాష్ట్ర అలాగే దేశ ప్రయోజనాలకుగానీ ఎలాంటి ముప్పూ రానివ్వబోమని బీజేపీ నేతలు కొందరు చెబుతుండడం గమనార్హం. ఏదిఏమైనా, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోయాక.. అత్యద్భుతంగా అభివృద్ధి చెందాల్సిన విశాఖ.. ఏదో ఒక రకంగా వివాదాల్లో నానుతోంది. అభివృద్ధి కనిపించడంలేదు సరికదా, విశాఖలో సహజసిద్ధమైన ప్రశాంత వాతావరణం ఈ రాజకీయాలతో దెబ్బతింటోందన్న విమర్శలున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమతో ఆపేస్తారా.? లేదంటే, ప్రైవేటు పెత్తనం ఇతర ముఖ్యమైన సంస్థలపైనా వుండబోతోందా.? అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.