కేటీఆర్ వర్సెస్ హరీష్: ఈసారి బాధ్యత ఎవరిది.?

The situation of the TRS in the Greater Elections was also made miserable

దుబ్బాక ఉప ఎన్నికలో చావు దెబ్బ తినేసింది అధికార టీఆర్ఎస్. గ్రేటర్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగానే తయారైంది. అయితే, మిగతా పార్టీల కంటే ఎక్కువ సీట్లు మాత్రం సంపాదించగలిగింది టీఆర్ఎస్. దుబ్బాకలో హరీష్‌రావుని దెబ్బ తీసిన బీజేపీ, గ్రేటర్ ఎన్నికల్లో కేటీఆర్‌కి షాకిచ్చింది. మరిప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఏం జరగబోతోంది.? ఇంతకీ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి బాధ్యతను టీఆర్ఎస్ తరఫున ఎవరు తీసుకుంటారు.? ప్రస్తుతానికైతే ఈ విషయమై గులాబీ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవడం, గ్రేటర్ ఎన్నికల సమయంలోనూ కొంత అలసత్వం ప్రదర్శించడం వంటివన్నీ టీఆర్ఎస్‌ని దారుణంగా దెబ్బతీశాయనీ, నాగార్జున సాగర్ విషయంలో అలాంటి తప్పులేమీ దొర్లకూడదనీ గులాబీ నేతలు చర్చించుకుంటున్నారు..

The situation of the TRS in the Greater Elections was also made miserable

అధిష్టానానికి నివేదిస్తున్నారు కూడా. అయితే, ముచ్చటగా మూడో దెబ్బ ఇంకా గట్టిగా కొట్టగలిగితే, తెలంగాణలో గులాబీ పాలనకి చరమగీతం పాడొచ్చని బీజేపీ భావిస్తుండడం గమనార్హం. అందరికంటే ముందుగా బీజేపీనే, నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి గ్రౌండ్ లెవల్‌లో స్కెచ్ రెడీ చేసేస్తోంది. కాగా, కాంగ్రెస్ గతంలోలా కాకుండా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలనుకుంటోందట. టీఆర్ఎస్ – బీజేపీ మధ్య ఫైట్‌లో తాము లాభపడతామన్నది కాంగ్రెస్ ధీమాగా కనిపిస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలే ప్రధాన శతృవు. కానీ, వాటిని ఆపేదెలా.? ఇది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వరకూ గ్రూపు తగాదాల్ని పక్కన పెట్టాలన్న కోణంలో పీసీసీ అధ్యక్షుడి ఎంపికను కూడా పక్కన పెట్టింది కాంగ్రెష్ అధిష్టానం. అయినాగానీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పుంజుకోవడం అంత తేలిక కాదు. ఏదిఏమైనా, ముచ్చటగా మూడో దెబ్బ తినాల్సి వస్తే, అదెంత భయంకరంగా వుంటుందో గులాబీ పార్టీకి బాగా తెలుసు. అదే సమయంలో, బీజేపీని దెబ్బ కొట్టడం అంత తేలిక కాదని కూడా గులాబీ బాస్‌కి అర్థమయిపోయింది. మరెలా.? తెలంగాణలో బీజేపీకి బ్రేకులేసేందుకు కేసీఆర్ సారు ఎలాంటి పథక రచన చేస్తారు.? వేచి చూడాల్సిందే.