పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటుతామంటూ అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. ‘బస్తీ మే సవాల్’ అంటున్నాయి. అయితే, ఇవి రాజకీయ పార్టీల గుర్తుల మీద జరిగే ఎన్నికలు కావు. కానీ, రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులే బరిలో వుంటారు. అంటే, ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులు మాత్రమే పోటీ పడతారన్నమాట. ఈమాత్రందానికి మేనిఫెస్టోలు విడుదల చేసెయ్యడమేంటి.? ఇదే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం. 90 శాతానికి పైగా పంచాయితీల్ని గెలుచుకోవాలంటూ ఇప్పటికే వైసీపీ అధిష్టానం, పార్టీ శ్రేణులకు.. ముఖ్యంగా మంత్రలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినితులకు టార్గెట్లు పెట్టిన వైనం కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం, అన్ని చోట్లా నామినేషన్ వెయ్యాల్సిందేనంటూ తెలుగు తమ్ముళ్ళకు సూచిస్తున్నారు. వైసీపీ పూర్తిగా ఏకగ్రీవాలపై దృష్టిపెట్టిన దరిమిలా, ఆ వ్యూహానికి చెక్ పెట్టడం కోసం టీడీపీ మాత్రమే కాదు, ఇతర రాజకీయ పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా వుంటే, ‘టీడీపీ నుంచి కొందరు గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు.. గెలిచి ఏం సాధించారు.? కొందరు వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయారు..
సో, టీడీపీ మద్దతుదారులని చెప్పుకోవడం కూడా దండగ..’ అన్న చర్చ గ్రామ స్థాయిలో తెలుగు తమ్ముళ్ళలోనే కనిపిస్తోందంటూ ఓ వాదన తెరపైకొచ్చింది. ఇది నిజంగానే టీడీపీని దారుణంగా డ్యామేజ్ చేసే ప్రచారం. మింగలేక కక్కలేక అన్నట్టు తయారైంది టీడీపీకి ఈ పరిస్థతి. అయితే, గ్రామ స్థాయిలో టీడీపీ బలమైన క్యాడర్ వున్న పార్టీనే. కానీ, ఈక్వేషన్స్ బాగా మారిపోయాయి. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీని కాదని ప్రజలు ప్రతిపక్షానికి పట్టం కట్టలేదు.. ఇంకో పార్టీ బీజేపీ వైపు చూశారు. అదే సీన్ ఏపీ పంచాయితీ ఎన్నికల్లోనూ రిపీట్ అయ్యేలా వుంది. వైసీపీకి కూడా బీజేపీ – జనసేన కారణంగా కొంత షాక్ తగిలే అవకాశం లేకపోలేదు. టీడీపీకి మాత్రం బీజేపీ – జనసేన దారుణంగా దెబ్బ కొట్టనున్నాయనే అర్థమవుతోంది. అదే జరిగితే, చంద్రబాబు పరిస్థితి ఏంటట.?