అవినీతి ఆరోపణలు, ఘాటైన విమర్శలు,అసభ్య దూషణలతో వైఎస్ జగన్ పై కాంగ్రెస్ హయాంలో ఆ తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని నాళ్లు ముప్పేట దాడి జరిగేది. రాజ్యధికారం కోసం సాగే పోరాటంలో భాగంగా జగన్ ను ఇలా టార్గెట్ చేయడానికి మూలకారణం చంద్రబాబు,లోకేషేననేది బహిరంగ రహస్యం. అయితే ఆ తరువాత జగన్ ఎన్నో ప్రతికూల పరిస్థితులు అధిగమించి 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తాను కోరుకున్న ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. అయితే ఆయన సిఎం అయిన వెంటనే తనను ఎంతగానో అవమానపర్చిన టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ లపై ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని అందరూ భావించారు. అయితే కారణాలు ఏమైనా జగన్ వారి కోటరీనే తప్ప నేరుగా టార్గెట్ చేయలేదు. అయితే ఇప్పుడు ఆ టైమ్ వచ్చిందని, చంద్రబాబు,లోకేష్ తమ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి చెరో కేసులో జైలుకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
లోకేష్ వ్యాఖ్యలతోనేనా…
పేదలకు ఇళ్ల స్థలాల కొనుగోలు వ్యవహారంలో 40 మంది వైసిపి ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డారని, వారు జైలుకు వెళ్లడం ఖాయమని ఇటీవల లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పలువురు జగన్ ను కలసి అన్ని అక్రమాలు చేసిన వారు అవినీతి రహితంగా పాలన అందించాలని తాపత్రయ పడుతున్న మనపై విమర్శలు చేయడం ఏమిటని…వారి అక్రమాలు నిరూపించి దోషులుగా తేల్చకపోతే జనం ముందు తలెత్తుకోలేమని వాపోయారట. దీంతో కారణాలేమైనా ఇంతకాలం ఈ విషయంపై అంతగా దృష్టి సారించని జగన్ ఇప్పుడు టిడిపి అతి ముఖ్యులను బుక్ చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారని అంటున్నారు.
raకీలక వ్యాఖ్యలు
వైసిపి నేతలు రోజా,బొత్సా,కొడాలి నాని, నందిగం సురేష్ ఇటీవలే మూడు రోజుల వ్యవధిలోనే వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమంటూ ప్రకటనలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరావతి భూముల వ్యవహారాల్లో అక్రమాలపై సిట్ వేసిన జగన్ సర్కార్ ఆ నివేదికతో సహా సిబిఐ దర్యాప్తు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపి నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. స్టేల రారాజు చంద్రబాబు ఒక్క అమరావతి వ్యవహారంలో కేసు విచారణ ఎదుర్కొన్నా జైలుకు పోవడం ఖాయమని తేల్చేశారు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ లో 2014-2019 మధ్య జరిగిన అవినీతి పై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐని కోరడం కలకలం రేపుతోంది. ఈ అవినీతిపై కేబినెట్ సబ్ కమిటీ జరిపిన విచారణలో రూ.2000 కోట్లు దాటి మళ్లినట్టు నిర్ధారించి అదే విషయాన్ని హైకోర్టుకు కూడా నివేదించింది. పాలనా అనుమతులు లేకపోవడం,టెండర్ల వ్యవహారంలో అక్రమాల నేపథ్యంలో దీనిపై సీబీఐ దర్యాప్తు జరిగితే ఐటీశాఖ మంత్రి అయిన లోకేష్ కు ఇబ్బందులు తప్పవంటున్నారు.
అందుకే ఆర్కే అలా!
చంద్రబాబుకు విశ్వసనీయ సలహాదారుడైన ఆర్కే తన పత్రికలో ఇటీవల కెసిఆర్, జగన్ జైలుకు…కెటిఆర్, భారతీ సిఎం అవుతారనే సంపాదకీయం రాయడానికి సంబంధం ఉందంటున్నారు వైసిపి అభిమానులు. చంద్రబాబు,లోకేష్ జైలుకు వెళ్లే పరిస్థితులు మంచుకొస్తున్నట్లు ఉప్పందడంతో
ఫలితంగా టిడిపి ఎక్కడ అస్థిర పడుతుందోనని అసలు సమయం సందర్భం లేకుండా కెసిఆర్,జగన్ జైలుకు వెళ్లడం ఖాయమనే కథలు రాశాడని మండిపడుతున్నారు. తద్వారా వైసిపి శ్రేణుల్లో ఆందోళన టిడిపి శ్రేణుల్లో మానసిక స్థైర్ధ్యం నింపడానికి ఆర్కే విశ్వప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఆర్కే ఆ ఉలికిపాటే చంద్రబాబు,లోకేష్ ఏదో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారనే సంకేతాలు ఇస్తుందని వారి అంచనా.