స్థానిక ఎన్నికల విషయమై ఆంధ్రపదేశ్‌లో రాజకీయ వేడి అనూహ్యంగా పెరిగిపోయింది. ఇక్కడ పొలిటికల్ ఫైట్ అనేది వైసీపీ ప్రభుత్వం – రాష్ట్ర ఎన్నికల కమిషన్ మధ్య అన్నట్లుగా మారింది. ముఖ్యమంత్రి వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. అన్నట్టుగా వివాదం రాజుకుంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కరోనాని బూచిగా చూపి, గతంలో స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడంతో అసలు వివాదానికి బీజం పడింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్కి కులాన్ని ఆపాదించడంతో వివాదం మరింత ముదిరింది. రాష్ట ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిందేనంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి సుప్రీంకోర్టు తలంటు పోసినా, ప్రభుత్వ పెద్దలకీ చిన్న పాటి చురకలే అంటించింది సర్వోన్నత న్యాయస్థానం. ఇక, ప్రభుత్వం ససేమిరా అంటున్నా.. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించేశారు నిమ్మగడ్డ.
దాంతో వివాదం ఇంకోసారి ముదిరింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. అన్నట్టుగా స్థానిక వివాదం నడుస్తోంది తప్ప.. అధికార పార్టీకీ, ప్రతిపక్ష పార్టీకి మధ్య రాజకీయ వైరం.. అన్నట్టుగా లేదు. స్థానిక ఎన్నికలు ఎలా జరుగుతాయో, ఎవరికి అనుకూలమో సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలియనిదేమీ కాదు. అయితే, గెలుపు విషయంలో ఎలాంటి అనుమానాలూ లేకపోయినా, అదికార పార్టీకి ఎందుకీ మొండి పట్టుదల.? ముఖ్యమంత్రి ఎందుకు ఇంతలా వ్యవహారాన్ని తెగేదాకా లాగుతున్నారు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ అధికార పార్టీకే అడ్వాంటేజ్ వుంటుంది. పైగా, విపక్షాల్లో ఐక్యత లేదు.. ప్రధాన ప్రతిపక్షం నీరుగారిపోయి వుంది. నిజానికి, ఇలాంటి పరిస్థితుల్లో మరో ఆలోచన లేకుండానే జగన్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సానుకూలత వ్యక్తం చేసి వుండాలి. ఇక, టీడీపీ విషయానికొస్తే.. వైసీపీతో పోటీ పడలేమని తెలిసీ, లేనిపోని హడావిడి చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇది నిజంగానే చిత్ర విచిత్రమైన రాజకీయం. ఇంతకు ముందెన్నడూ చూడనంత విచిత్రమిది. ఎవరి రాజకీయ లాభాలు ఏమిటోగానీ, ఎవరి రాజకీయ భయాలు ఏమిటోగానీ.. చరిత్రలో ఎప్పుడూ లేనంత వివాదాస్పదమవుతున్నాయి ఆంధ్రపదేశ్‌లో స్థానిక ఎన్నికలు.