దేశానికి కొత్త పార్లమెంటు భవనం అవసరమైంది. పాత భవనం పురాతనమైనది కావడంతో, దానికి ఆనుకుని కొత్తగా పార్లమెంటు భవనం కట్టాలన్నది మోడీ సర్కార్ సంకల్పం. ఈ మేరకు స్కెచ్ రెడీ అయిపోయింది.. శంకుస్థాపన కూడా జరిగింది. వీలైనంత త్వరగా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించేయాలని మోడీ సర్కార్ భావిస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరిగిపోయాయి. అయితే, దేశానికి ఇప్పుడు కొత్తగా మరో పార్లమెంటు భవనం ఎందుకు.? ఆ డబ్బుతో ఆకలి చావుల్ని ఆపచ్చు కదా.? అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనుండగా, ఈ సమయంలో కమల్ హాసన్ ‘వ్యాలీడ్’ పాయింట్‌ని లేవనెత్తారు.
కొత్త పార్లమెంటు, మళ్ళీ అక్కడేనా.?
కొత్త పార్లమెంటు భవనం కట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు, అది దేశ రాజధాని ఢిల్లీలోనే ఎందుకు వుండాలి.? ఉత్తరాది – దక్షిణాది అన్న వాదనలు తెరపైకొస్తున్న దరిమిలా, ఆ భవనాన్ని దక్షిణాదిలో ఎక్కడన్నా కట్టొచ్చు కదా.? అన్న ప్రశ్న దక్షిణాది ప్రజల్లో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా తమిళనాడులో ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. దేశానికి రెండో రాజధాని గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే వుంది. పైగా ఢిల్లీ అంటే, కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ అయి కూర్చుంది. ఈ పరిస్థితుల్లో రెండో రాజధాని ఆనే ఆలోచన కూడా సబబైనదే.
రేసులో అమరావతి కూడా.!
తాను దూర సందు లేదుగానీ, మెడకో డోలు.. అన్నట్టుంది పరిస్థితి. లేకపోతే, అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తరలిపోనుంది.. జ్యుడీషియల్ క్యాపిటల్ కర్నూలుకి వెళ్ళిపోనుంది.. ఈ పరిస్థితుల్లో అమరావతికి దేశ రాజధాని వచ్చేస్తుందా.? అమరావతి దేశానికి రెండో క్యాపిటల్ అయ్యే అవకాశం వుందా.? ‘అయ్యా మోడీగారూ, మీరే ఢిల్లీని తలదన్నేలా అమరావతిని నిర్మిస్తామని చెప్పారు.. దేశానికి రెండో రాజధాని అయ్యే అవకాశాన్ని అమరావతికి ఇవ్వరూ..’ అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదీ వ్యాలీడ్ పాయింటే కదా.!
అక్కడ రెండు రాజధానులట..
తాము అధికారంలోకి వస్తే, తమిళనాడుకి రెండో రాజధానిగా మధురైకి హోదా తెస్తామంటున్నారు మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్. ఇది కూడా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ‘పాయింట్’ కాబోతోంది. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.? ఏమో, ఏపీ మోడల్‌ని దేశంలోని వివిధ రాష్ట్రాలు పాటిస్తే, రెండేసి.. మూడేసి ఏం ఖర్మ.. ఒక్కో రాష్ట్రానికి ఐదేసి, పదేసి రాజధానులు కూడా రావొచ్చు. అలా జరిగితే, దేశానికీ ఓ ఇరవయ్యో, ముప్ఫయ్యో రాజధానులు రావొచ్చన్నమాట.