మహాపతనదిశగా తెలుగుదేశం పార్టీ 

Telugudesam Party as the Depression
మామగారు పెట్టిన పార్టీని మనుమడు భూస్థాపితం చేస్తాడని మొన్నమొన్నటిదాకా ఒక నానుడి ప్రజల నోళ్ళలో నానుతుండేది.  కానీ లోకేష్ నాయుడికి అంత శ్రమ ఇవ్వకుండా అల్లుడే ఆ కార్యాన్ని నెరవేర్చేట్లు కనిపిస్తున్నది.  ప్రస్తుత తెలుగుదేశం దీనస్థితిని గమనిస్తే గత నలభయ్ ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరుగని సంక్షోభంలో పార్టీ కూరుకుని పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.  తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగినపుడు “సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్ళు” అని తమ ఆశయంగా ప్రకటించుకున్నారు స్వర్గీయ ఎన్టీఆర్.  కొంతకాలం వరకు ఆయన ఆ విధంగానే పరిపాలన సాగించారు.  పేదలకోసం అనేక సంక్షేమ పధకాలను అమలుచేశారు.  అప్పట్లో ఆ పార్టీకి కులముద్ర పెద్దగా కనిపించలేదు కానీ, రానురాను చంద్రబాబు పెత్తనం ముదురుతున్న సమయంలో కులగజ్జి పాకిపోయింది.  అంతేకాదు…పేదల అభ్యున్నతి ఆశించి ఎన్నికల్లో నిరుపేదలకు కూడా ఎన్టీఆర్ అవకాశాలు కల్పించి ఎమ్మెల్యేలను, మంత్రులను చేశారు.  కానీ, దురదృష్టవశాత్తూ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని కబ్జా చేసినక్షణం నుంచి కోట్లాధిపతులు, అక్రమార్జనపరులు, నరహంతకులు, నైతికవిలువలు లేనివారు పార్టీలో ప్రముఖస్థానాలకు పాకిపోయారు.  పేదలు, బలహీనవర్గాలవారికి  చోటు లేకుండా పోయింది.  ఈ కోట్లాధిపతులు, బ్యాంకులకు రుణాలు  ఎగవేసే బాపతు నాయకులు సామాన్యుల్లా నడివీధుల్లో పార్టీ జెండాలు మోసి ధర్నాలు, రాలీలు చేసి పోరాటాలు చెయ్యరు. 
   
Telugudesam Party as the Depression
Telugudesam Party as the Depression
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  వేలకోట్ల రూపాయల ఆస్తులను పోగేసుకోవడం, తమ పదవులను అడ్డం పెట్టుకుని ఆర్థికరంగ సంస్థలను మోసం చెయ్యడం, తమ పరిశ్రమలకు, వ్యాపారాలకు అనుమతులు తెచ్చుకోవడం, లక్షలకోట్ల రూపాయలను సంపాదించుకోవడం, దోచుకున్న సంపదను విదేశాల్లో దాచుకోవడం మాత్రమే ఈ నాయకులకు తెలిసిన విద్య.   పార్టీ అధికారం కోల్పోగానే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీలో చేరిపోవడం, కేసులనుంచి తప్పించుకోవడం, కేసులను కొట్టేయించుకోవడం లాంటి చర్యలకు పాల్పడతారు.    మరి క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పోరాడేది ఎవరు?  
 
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఇప్పటికి పదిహేనేళ్ళు అధికారానికి దూరంగా ఉన్నది.  ఆ కష్టకాలంలో పార్టీకి కొందరు నాయకులు దూరం అయ్యారేమో కానీ, కేడర్ మాత్రం చెక్కుచెదరలేదు.  గ్రామస్థాయి కార్యకర్తలు పార్టీపట్ల నిబద్ధతనోనే పనిచేశారు.  కానీ, జగన్మోహన్ రెడ్డి రంగప్రవేశం తదుపరి మొన్నటి ఎన్నికల్లో తగిలిన దెబ్బ తెలుగుదేశం పార్టీని అతలాకుతలం చేసింది.  ఇంతటి ఘోరాతిఘోరమైన పరాజయాన్ని ఏమాత్రం ఊహించి ఉండరు చంద్రబాబు.  గ్రామస్థాయిలో వైసిపి ఎలా దూసుకునిపోతున్నదో కళ్లారా చూస్తున్న కార్యకర్తలు కూడా నిస్పృహలోకి జారుకుంటున్నారు.  జగన్ అమలు చేస్తున్న సంక్షేమపథకాలు పార్టీలకు అతీతంగా అందుతుండటంతో తెలుగుదేశం మద్దతుదారులు కూడా తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు.  ఇప్పట్లో జగన్ మోహన్ రెడ్డికి తిరుగులేదని అభిప్రాయపడుతున్నారు.  తత్ఫలితమే మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికల్లో అత్యంత పేలవమైన ఫలితాలకు నాంది పలికింది.  
 
నిన్న కుప్పం నియోజకవర్గంలో జరిపిన పర్యటన చంద్రబాబుకు కళ్ళు బైర్లు కమ్మేలా చేసిందనడంలో అతిశయోక్తి లేదు.  ఆయన వెంట వచ్చిన కార్ల సంఖ్య కన్నా రాలీగా వెంటవచ్చిన జనం తక్కువ అంటే తెలుగుదేశం ప్రభావం ఎలా దిగజారిపోతున్నదో అర్ధం అవుతుంది.  చంద్రబాబు ఏమాత్రం జీర్ణించుకోలేని విషయం ఏమిటంటే ఆ ర్యాలీలో చంద్రబాబు సముఖంలోనే “జూనియర్ ఎన్టీఆర్ రావాలి” అని కొందరు నినదించడం.  దీన్నిబట్టి అర్ధం అయ్యేది ఏమిటి?  చంద్రబాబు పని అయిపోయిందనేగా?  పార్టీని నడిపే శక్తి చంద్రబాబుకు లేదనేగా?  చంద్రబాబును మరీ కడుపుకోతకు గురిచేసే అంశం ఏమిటంటే తన కొడుకు లోకేష్ నాయుడు ఉండగా జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుని రావాలని ప్రజలు నినాదాలు ఇవ్వడం!  తన కొడుకు ఒత్తి శుంఠ అని, పనికిమాలినవాడని, నిష్ప్రయోజకుడని, అతనివలన పార్టీ అణుమాత్రం కూడా లేవదని ప్రజలు గ్రహించడం చూసి చంద్రబాబు తప్పకుండా కుమిలికుమిలిపోయి ఉంటాడు.  
 
తన కళ్ళముందే తన కొడుకును హేళనచేస్తూ వేరే వారి బిడ్డను పొగడటం ఏ తండ్రికైనా హృదయశల్యాయమానమే కదా!  ఇంతకన్నా చంద్రబాబు జీవితానికి మరేమి అవమానం ఉంటుంది?  ఒక వంక తాను స్పాన్సర్ చేస్తున్న అమరావతి ఉద్యమం నానాటికీ బలహీనపడిపోతుండటం, అమరావతి ప్రాంతంలోనే అతి తక్కువ పంచాయితీలు దక్కడం, అమరావతిని వ్యతిరేకిస్తున్న వైసిపికి మెజారిటీ స్థానాలు రావడం..పెద్ద అవమానంగా భావిస్తుంటే…సాక్షాత్తు సొంత నియోజకవర్గంలో ఎదురైన పరాభవం చంద్రబాబు ఆత్మస్థైర్యాన్ని దిగజార్చి వెన్నుపోటు పొడిచేదే!   
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు