కెప్టెన్ విజయకాంత్ మరణించిన సమయంలో తాను చెన్నైలో లేనని, నిజానికి ఆయన అంత్యక్రియలను దగ్గరుండి పూర్తి చేయాల్సిందని, కానీ ఏవిూ చేయలేకపోయానని అందుకే ఆయన్ను క్షమించమని కోరుతున్నట్టు హీరో విశాల్ చెప్పారు. విజయకాంత్ మృతి చెందిన సమయంలో విశాల్ అమెరికాలో ఉన్నారు. దీంతో ఆయన అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. చెన్నైకి వచ్చిన ఆయన మంగళవారం ఉదయం కోయంబేడులోని కెప్టెన్ సమాధికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత ఆయన తన సొంత ఖర్చులతో 500 మందికి అన్నదానం చేశారు. విశాల్ వెంట హీరో ఆర్య కూడా ఉన్నారు.
ఆ తర్వాత విశాల్ మాట్లాడుతూ… కేవలం సినిమా ప్రపంచంలోనే కాకుండా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి కెప్టెన్ విజయకాంత్. సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దేవుడిగా భావిస్తాం. కానీ, విజయకాంత్ జీవించివున్నపుడే దేవుడయ్యారు. ఆయన చనిపోయిన సమయంలో నేను నగరంలో లేను. అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొని అన్ని పనులు చేసి ఉండాల్సింది. కానీ, ఏవిూ చేయలేకపోయా. చివరి చూపునకు నోచుకోలేకపోయా. అందుకే నన్ను క్షమించమని వేడుకుంటున్నా. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ మన మనస్సుల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచి ఉంటారు. నడిగర్ సంఘం భవవానికి కెప్టెన్ పేరును పెట్టేందుకు ఏ ఒక్కరూ ఆక్షేపణ తెలపకపోవచ్చు. ఈ విషయంలో కచ్చితంగా భిన్నాభిప్రాయాలు ఉండవని భావిస్తున్నా. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన వస్తుంది. అదే సమయంలో విజయకాంత్‌కు ’భారతరత్న’ పురస్కారాన్ని ఇస్తారో లేదో తెలియదు.. కానీ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఆయనకు నివాళి అర్పించారు‘ అని పేర్కొన్నారు.