(యనమల నాగిరెడ్డి)
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, ప్రభుత్వ విప్ రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య “నేతిబీరకాయలో నెయ్యి” చందంగా రాజీ కుదురుతూ ఉంది. వర్గ పోరు సాగుతూనే ఉంది. టీడీపీ అధినేత, ఎపి సీఎం చంద్రబాబు దగ్గర వీరి పంచాయతీ గత కొన్ని సంవత్సరాలుగా ఎడతెగకుండా సా….గుతూనే వుంది. జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక తేలితే తప్ప కడప ఎంపీ స్తానం అభ్యర్థి ఎంపిక పూర్తి కాదని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం దగ్గర మరోమారు జరుగుతున్న పంచాయతీ ఫలితం తెలుస్తుందా? లేదా? అన్న అంశం పై టీడీపీ వర్గాలు, రాజకీయ విశ్లేషకులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా వైరి వర్గాలుగా సాగిన దేవగుడి, గుండ్లకుంట కుటుంబాలు 2014 తర్వాత ఒకే ఒరలో రెండు కత్తులుగా సంసారం సాగిస్తున్నాయి. ఈ ఎన్నికలలో మరోసారి జమ్ములమడుగు నుండి ఎంఎల్ఏ గా పోటీ చేసి టీడీపీ ప్రభుత్వం వస్తే తిరిగి మంత్రి కావాలని ప్రస్తుతం వైసీపీ ఎంఎల్ఏ గా గెలిచి టీడీపీ లో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆశపడుతున్నారు. టీడీపీ పుట్టి నప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని, అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నామని, తమ ప్రత్యర్థిని మంత్రిని చేసి ఇప్పటికే తమ ఉనికికే ప్రమాదం తెచ్చారని కాబట్టి జమ్మలమడుగు నుంచి తమకే టికెట్ ఇవ్వాలని రామసుబ్బారెడ్డి కోరుతున్నారు.
గతంలో చంద్రబాబు ఈ రెండు వర్గాలకు కుదిరించిన రాజీ మేరకు రామసుబ్బారెడ్డిపై ఆదినారాయణరెడ్డి వర్గం సుప్రీంకోర్టు లో వేసిన కేసులో రాజీ కావాలని, రామసుబ్బారెడ్డి ఎంఎల్ఏ గాను, ఆదినారాయణరెడ్డి కడప ఎంపీగానూ పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇటీవల బద్వేల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ “కడప ఎంపీగా” టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించి మరోసారి ఈ వివాదానికి తెరలేపారు.
వైస్సార్ కుటుంబానికి కంచుకోట కడప ఎంపీ స్థానం
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఎత్తుగడలు, ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వ్యక్తిగత సంభంధాల వల్ల కడప పార్లమెంట్ స్థానం వైస్సార్ కుటుంబానికి కంచుకోటగా మారింది. ప్రస్తుతం ఎంపీగా గెలిచిన అవినాష్ రెడ్డి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి కార్యకర్తలతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. దీనికి తోడు జగన్ క్రేజ్ ఉండనే ఉంది. అలాగే టీడీపీలో ఉన్న వర్గ పోరు, అభ్యర్థుల ఎంపికపై సాగుతున్న అనిశ్చితి వైసీపీకి అదనపు బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదని, అందువల్ల జమ్ములమడుగు ఎంఎల్ ఏ స్థానానికే పోటీ చేయడం మంచిదని మంత్రి ఆది భావిస్తున్నారు. అందులో భాగంగానే మంత్రి ఈ వివాదానికి తేర తీశారని అంటున్నారు. చంద్రబాబు మాట మేరకు తానూ పోటీ చేయకుండా తన కుటుంబీకులెవరినైనా ఎన్నికల బరిలో దింపాలని మంత్రి ప్రయత్నిస్తున్నారని, అయితే ఆ ప్రయత్నాలకు ఆయన సోదరులు గండి కొట్టారని టీడీపీ వర్గాలలో ప్రచారంలో ఉంది.
జమ్ములమడుగు స్థానం పైనే మంత్రి దృష్టి
ఏ పరిస్థితులలో కూడా జమ్ములమడుగు అసెంబ్లీ స్థానానికె పోటీ చేయాలని మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని,అందుకోసం ఎటు తిరిగి చంద్రబాబును ఒప్పించాలని ఆయన కృషి చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. దీనివల్ల నియోజకవర్గంలో ఉన్న బలమైన రామసుబ్బారెడ్డి వర్గం తోడుగా శాసనసభకు సులభంగా ఎన్నిక కావచ్చునని, తమ వర్గాన్ని కాపాడుకోవచ్చునని మంత్రి భావిస్తున్నారు. టీడీపీ గెలిస్తే మంత్రి పదవి బోనస్ గా ఉంటుందనేది ఆయన భావనట . ఒకవేళ అలా సాధ్యం కాక పొతే అంతర్గత విభేదాలతో తల్లడిల్లుతున్న ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి అవకాశం కల్పించాలని ఆదినారాయణ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారని సమాచారం. కడప ఎంపీకి పోటీ చేయడం కంటే ప్రొద్దుటూరు కు పోటీ చేయడమే మంచిదని, గట్టిగా పనిచేస్తే గెలిచే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
అయితే తాము గత కొన్ని సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఉన్నామని, రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా జరగనంత నష్టం తమకు మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన వర్గం వల్ల ఈ నాలుగేళ్లలో జరిగిందని, తమ ఉనికి కాపాడుకోడానికి, తన వర్గాన్ని రక్షించుకోడానికి తాను జమ్ములమడుగు స్థానానికి పోటీ చేయడం తప్పా మరో మార్గం లేదని ప్రభుత్వ విప్ రామసుబ్బారెడ్డి భావిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ వర్గ ప్రయోజనాలు ప్రక్కన పెట్టి పార్టీ కోసం మంత్రికి అన్ని రకాల సహకరించామని, ఈ ఎన్నికలలో ఆయన సహకరిస్తే తాను సులభంగా గెలుస్తానని విప్ అంటున్నారు. ఒకవేళ మంత్రి మద్దతు ఇవ్వకపోయినా తాను పోటీ చేసి గెలవగలనని రామసుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. “ఇప్పటికి మన వర్గానికి జరిగిన నష్టం చాలు. నీవు వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాల్సిందే. అలాకాకపోతే మా దారి మేం చూసుకుంటామని” రామసుబ్బారెడ్డి వర్గీయులు పట్టు పడుతున్నారు. ఒకసారి ముఖ్యమంత్రి సమక్షంలో రాజీకి అంగీకరించి తిరిగి కొత్త పల్లవి (పాత పాట) పాడటం మంత్రికి తగదని, ముఖ్యమంత్రి తమకు న్యాయం చేస్తారని రామసుబ్బారెడ్డి నమ్మకంగా ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు జమ్ములమడుగు పంచాయతీ తెలిస్తేనే కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే టీడీపీ అభ్యర్థిపై స్పష్టత వస్తుందని, మరి కొంత కాలం ఈ పంచాయతీ ఇలాగే సాగుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. పంచాయతీ తెగిన తరువాత ఎవరు ఎలాంటి ఎత్తులు వేస్తారో? జమ్ములమడుగు రాజెవరో? కడప పార్లమెంట్ స్థానంలో బలిపశువు ఎవరో? తెలుసుకోవాలంటే మరి కొంత కాలం వేచిచూడాల్సిందే!