వైఎస్ జగన్ కంచుకోట కడప జిల్లాలో జమ్మలమడుగు నియోజకవర్గం అతిముఖ్యమైనది. ఇక్కడ వైఎస్ కుటుంబానికి ఎనలేని క్రేజ్ ఉంది. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన జమ్మలమడుగు జనం ప్రస్తుతం జగన్ సారథ్యంలో ఉన్న వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఆనాడు వైఎస్ఆర్, ఈనాడు జగన్ ఇద్దరూ తమను ఇంతలా ఆదరిస్తున్న ఈ నియోజకవర్గం మీద ఎప్పుడూ ఒక కన్ను వేసే ఉంచేవారు. కానీ ప్రస్తుతం ఇక్కడ వైసీపీలో అసంతృప్తి నాదాలు గట్టిగా వినిపిస్తున్నాయని అంటున్నారు వైసీపీ నేతలు. అందుకు కారణం ఎవరు అంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరే వినిపిస్తోంది. గత ఎన్నికల్లో సుధీర్ రెడ్డికి జగన్ టికెట్ కేటాయించారు. జమ్మలమడుగులో మంచి వ్యక్తి అనే పేరు ఉండటంతో జగన్ పెద్దగా ఆలోచించకుండానే సుధీర్ రెడ్డికి టికెట్ ఇచ్చేశారు.
రామసుబ్బారెడ్డి లాంటి బలమైన ప్రత్యర్థి ఉన్నప్పటికీ ప్రత్యేక దృష్టి పెట్టి గెలిపించుకున్నారు. అన్ని విషయాల్లోనూ సుధీర్ రెడ్డికి తన అనుచర వర్గంతో సహాయ సహకారాలు అందించారు. కానీ గెలిచాక సుధీర్ రెడ్డి వైఖరి మారిపోయిందని చెబుతున్నారు సొంత పార్టీ నేతలు. ఎమ్మెల్యే అన్నాక నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయడానికి కృషి చేయాలి. కానీ సుధీర్ రెడ్డి మాత్రం ఎవ్వరినీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారట. ప్రధానంగా ప్రత్యర్థుల విషయంలో సమన్వయం పాటించే ఆలోచనే లేదట ఆయనలో. దశాబ్దాలుగా టీడీపీ నేతగా ఉన్న రామసుబ్బారెడ్డి ఎన్నికల అనంతరం వైసీపీలో చేరారు. వరుసగా మూడు దఫాలుగా ఓడిపోతూ వస్తున్నా రామసుబ్బారెడ్డి అల్లాటప్పా లీడర్ అయితే కాదు.
జమ్మలమడుగులో వైఎస్ ప్రాభవానికి ఎదురునిలిచి తెలుగుదేశం పార్టీని నడిపిన ఘనత ఉంది ఆయనకు. టీడీపీ తరపున గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు కూడ. తెలుగుదేశం నుండి బయటికొచ్చినప్పటికీ ఆయనకంటూ సొంత కేడర్ ఉంది. సుధీర్ రెడ్డితో పోలిస్తే రామసుబ్బారెడ్డికే అత్యధిక సంఖ్యలో వ్యక్తిగత ఫాలోవర్లు ఉన్నారు. అయన లాంటి నేత దశాబ్దాల అనుబంధం ఉన్న టీడీపీని వీడి వైసీపీలో వస్తే ట్రీట్మెంట్ కొంచెం మంచిగా ఉండాలి. కనీస ప్రాముఖ్య ఇచ్చి ఆయన్ను పార్టీలో కలిసిపోయేలా చూడాలి. ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి బాధ్యత అది. కానీ సుధీర్ రెడ్డి మాత్రం రామసుబ్బారెడ్డికి అస్సలు పట్టించుకోవట్లేదట. పైగా పనిగట్టుకుని చులకన చేస్తున్నారనే టాక్ ఉంది.
ప్రభుత్వ పనుల్లో కానీ, పార్టీ కార్యకలాపాల్లో కానీ రామసుబ్బారెడ్డికి చోటు ఇవ్వట్లేదట. ఈ అవమానకర ట్రీట్మెంట్ రామసుబ్బారెడ్డికి, ఆయన వర్గానికి నచ్చట్లేదట. మిగిలిన వైసీపీ నేతలంతా రామసుబ్బారెడ్డికి దగ్గరైనా సుధీర్ రెడ్డి ఇలా చేయడం భావ్యం కాడనై స్వయంగా వైసీపీ నాయకులే అంటున్న మాట. ఇటీవల జరిగిన గండికోట ప్రాజెక్టు ముంపు పరిహారం గొడవల్లో రామసుబ్బారెడ్డి ప్రధాన అనుచరుడు హత్య కాబడ్డాడు. దాంతో రామసుబ్బారెడ్డి తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు. ఈ పరిణామాలు పార్టీకి మంచివి కావని, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన, బోలెడంత భవిష్యత్తు ఉన్న సుధీర్ రెడ్డికి అస్సలు మంచిది కాదని అంటున్నారట. మరి తాను ఏరి కోరి రాజకీయాల్లోకి తీసుకొచ్చిన సుధీర్ రెడ్డిని జగన్ ఎలా గాడిలో పెడతారో చూడాలి.