హిందుత్వ.. అనే అంశానికి పేటెంట్ హక్కు తమదేనని బీజేపీ చెబుతుంటుంది. బీజేపీ చెప్పడం కాదు, బీజేపీ ప్రత్యర్థులు కూడా ఇదే విషయాన్ని ఇంకోలా చెబుతుంటారు.. బీజేపీని మతతత్వ పార్టీ అని పిలవడం ద్వారా. ఆంధ్రపదేశ్‌లో కూడా బీజేపీ, ‘హిందుత్వ’నే నమ్ముకుంది. ఆ ఎజెండాని తన భుజమ్మీదకు ఎత్తుకోవాలని తెలుగుదేశం పార్టీ పాకులాడుతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ‘క్రిస్టియన్ ముఖ్యమంత్రి’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిన్న చంద్రబాబు సంబోదించారు. నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా క్రిస్టియన్. కానీ, ఆయన ఏనాడూ ఆ భావజాలాన్ని జనం మీద రుద్దలేదు. అయితే, ఆంధ్రపదేశ్లో తాజా పరిణామాలు కొంత వైసీపీకి ఇబ్బందికరంగానే మారాయి. కొంతమంది మంత్రులు, విపక్షాలపై విమర్శలు చేసే క్రమంలో హిందుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాట వాస్తవం. ఈ క్రమంలోనే టీడీపీ, అడ్వాంటేజ్ తీసుకుంటోంది.. బీజేపీని వెనక్కి నెట్టి, హిందూ ఓటు బ్యాంకుని పూర్తిస్థాయిలో తమవైపుకు తిప్పకునేందుకు ప్రయత్నిస్తోంది.
కానీ, ఇక్కడ టీడీపీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. రాష్ట్రంలో చాలా మతాలకు చెందినవారి ఓట్లు వున్నాయి. హిందుత్వ ఎజెండా పెట్టకుంటే, టీడీపీ ఓటు బ్యాంకు సగానికి పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు. ఎందుకంటే, బీజేపీ తరహాలో హిందుత్వ ఎజెండాతో టీడీపీ పోరాటం చేయలేదు గనుక. అసలు, రాజకీయాల్లో మతం ప్రస్తవాన ఎందుకు.? కులం ప్రస్తావన ఎందుకు.? అంటే, అవి లేకుండా ఆంధ్రపదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకోవడానికి వీల్లేని పరిస్థితి. వైసీపీ, టీడీపీ.. ఈ రెండిటి మధ్య రాజకీయ యుద్ధం నేపథ్యంలో ప్రధాన ఎజెండా మతం, కులం మాత్రమే అన్నట్టుంది. కమ్మ వర్సెస్ రెడ్డి.. అన్నట్టుగా సాగుతున్న రాజకీయ యుద్ధం కాస్తా ఇప్పుడు హిందూ వర్సెస్ క్రిస్టియానిటీ అన్నట్టుగా తయారైంది. చంద్రబాబు మీద క్రిస్టియన్ సంస్థలు విరుచుకుపడుతోంటే, వైఎస్ జగన్ మీద హిందూ మత సంస్థలు విరుచుకుపడుతున్నాయి. ఈ నికృష్ట రాజకీయం కేవలం పార్టీలకే పరిమితం. ప్రజలు.. వీటన్నిటికీ అతీతంగానే వ్యవహరిస్తున్నారు.. కలిసిమెలిసి వుంటున్నారు. ప్రజల్ని ఉద్ధరించాల్సిన రాజకీయ పార్టీలు, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూడటం శోచనీయం.