వైసీపీ వర్సెస్‌ టీడీపీ: రాజీనామా చేసెదెవరు.?

tdp

‘బస్తీ మే సవాల్‌’ అంటోంది తెలుగుదేశం పార్టీ.. తామేం తక్కువ తినలేదంటోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. రాష్ట్రంలో ఏకైక రాజధాని అమరావతి వర్సెస్‌ మూడు రాజధానుల వివాదం తారాస్థాయికి చేరింది. నిన్నటితో అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తవడంతో, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ సాక్షిగా చంద్రబాబు, అధికార వైసీపీకి సవాల్‌ విసిరిన విషయం విదితమే. ‘రెఫరెండం’ కోరారాయన. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకంటే రెఫరెండం ఏముంటుంది.? ‘మీరు రాజీనామా చెయ్యండి.. మేం రాజీనామా చేస్తాం.. ఎవరి సత్తా ఏంటో తేల్చేసుకుందాం.. ఓడిపోతే, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా..’ అనేశారు చంద్రబాబు. కానీ, చంద్రబాబు అండ్‌ టీమ్‌ రాజీనామాకి సిద్ధపడుతుందా.?

tdp challenging ysrcp
tdp challenging ysrcp

చంద్రబాబుకి ఇదొక అద్భుత అవకాశం

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో 18 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలున్నారు. మొత్తానికి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో దక్కితే, ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేశారు. సో, ఇది నిజంగానే చంద్రబాబుకి అత్యద్భుతమైన అవకాశం. ఆ 18 మంది ఎమ్మెల్యేలలో తనతోపాటు, బావమరిది బాలయ్యని మాత్రమే చంద్రబాబు కాపాడుకోగలరు.. 2024 ఎన్నికలదాకా. కాబట్టి, కాస్త రిస్క్‌ చేసేస్తే.. ఇప్పుడే చేసెయ్యాలి. అందరితోనూ కాకపోయినా, రాయలసీమ నుంచి ఒకరు, ఉత్తరాంధ్ర నుంచి మరొకరు.. మరొకరు.. మిగతా ప్రాంతం నుంచి రాజీనామా చేసేలా చంద్రబాబు ఆయా ఎమ్మెల్యేలను ఒప్పించగలిగితే.. తాడో పేడో తేలిపోతుంది.

నిండా మునిగాక చలేంటి.?

ఆ ముగ్గురూ ఓడిపోయినా చంద్రబాబుకి నష్టమేమీ వుండదు. ఎందుకంటే, టీడీపీ ఇప్పటికే నిండా మునిగిపోయింది గనుక. అయితే, చంద్రబాబు మాట విని రాజీనామా చేసేదెవరు.? ఒకవేళ రాజీనామా చేసినా, దాన్ని ఆమోదించాల్సింది స్పీకర్‌. ఆ స్పీకర్‌ ఎటూ వైసీపీ మనిషి గనుక.. రాజీనామాల్ని ఆమోదించకపోతే, అదో పెద్ద తలనొప్పి. ఇవన్నీ చంద్రబాబు ముందే ఊహించలేరా.? ఆయనకెందుకు తెలియదు, అన్నీ తెలుసు.. అందుకే, తాటాకు చప్పుళ్ళలా ఓ సవాల్‌ విసిరేశారంతే.

వైసీపీకి కూడా ఇది సదవకాశమేగానీ..

టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, దాన్నే రిఫరెండంగా వైఎస్‌ జగన్‌ చూపించొచ్చు. ఇంత అద్భుతమైన అవకాశాన్ని వైఎస్‌ జగన్‌ వినియోగించుకుంటారా.? లేదా.? ‘మేం రెడీ.. వైఎస్‌ జగన్‌ ఆదేశిస్తే, రాజీనామా చేసేస్తాం..’ అంటూ కొందరు ఎమ్మెల్యేలు ముందుకు దూకుతున్నారు. వాళ్ళ గోల వాళ్ళది.. రాజీనామా చేసి, మళ్ళీ పోటీ చేసి గెలిస్తే.. మంచి పదవులు దక్కే అవకాశం వుంటుంది. కానీ.. రాజీనామా – ఉప ఎన్నిక జరిగే అవకాశం వుందా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.